గుండాల, ఏప్రిల్ 30 : పోడు భూమి పట్టా విషయమై ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ బీట్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన గుండాల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ కథనం ప్రకారం.. గుండాల మండలం నడిమిగూడెం బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బానోతు నరేశ్.. సాయనపల్లి బీట్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఈ క్రమంలో సాయనపల్లి గ్రామానికి చెందిన ఓ పోడు ఆరు ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తుండగా.. అందులో మూడు ఎకరాలకు సంబంధించి పట్టా కాగితాలు లేవు. దీంతో ఆ భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మూడెకరాలకు ఉన్న పట్టాను కూడా రద్దు చేస్తామని, అందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తనకు రూ.15 వేలు లంచం ఇవ్వాలని బీట్ ఆఫీసర్ నరేశ్ సదరు రైతును బెదిరించి, డిమాండ్ చేశారు.
అందుకు అంగీకరించిన రైతు తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి లంచం డిమాండ్ అంశం గురించి వివరించారు. వారు పన్నిన పథకం ప్రకారం బాధిత రైతు రూ.10 వేలను గుండాలలోని కార్యాలయంలో బీట్ ఆఫీసర్‌కు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు. ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి, ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.