ఊట్కూర్, ఆగస్టు 12: యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో మై భారత్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని బుధవారం ఊట్కూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవిస్తూ దేశభక్తి భావనతో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ జెడ్పిటిసి సభ్యుడు సూర్యప్రకాష్ రెడ్డి, ఎంపీడీవో పావని, ఎంఈఓ మాధవి సూచించారు. మై భారత్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని బలపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు దేశభక్తి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని నాయకులు, అధికారులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగదీష్ గౌడ్, ఉపాధ్యాయులు ప్రేమకుమారి, నారాయణ, అంజమ్మ, రామచంద్రారెడ్డి, పారిజాత, రాములు, షాహీన్, భారతి తదితరులు పాల్గొన్నారు.