రుద్రంపూర్, ఆగస్టు 12 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎన్ సి డబ్ల్యూ ఏ (జాతీయ బొగ్గు వేతన ఒప్పందం (National Coal Wage Agreement) ఉద్యోగుల క్వార్టర్స్ కేటాయింపునకు బుధవారం రుద్రంపూర్‌లోని ఆర్ సి ఓ ఏ క్లబ్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. సీనియారిటీ ప్రాతిపదికన చేపట్టిన ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ యాజమాన్యం, కమిటీ సభ్యులు, యూనియన్ ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో పారదర్శకంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్ సి, ఎం సి, ఎం.హెచ్, సీ2, టి 2, ఎం.డి, ఎన్.బి, ఏ టైపు క్వార్టర్స్ కేటాయింపునకు సంబంధించిన విధానాలు, అర్హతలు, ప్రాధాన్యత క్రమం తదితర అంశాలను అధికారులు ఉద్యోగులకు వివరించారు. మొత్తం 59 మంది ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకోగా, వారిలో 14 మంది క్వార్టర్స్‌ను ఎంపిక చేసుకున్నారు. 36 మంది గైర్హాజరయ్యారు. మరో 9 మంది క్వార్టర్స్ ఎంపికపై ఆసక్తి చూపలేదు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఎం. గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఏజీఎం (సివిల్) రామకృష్ణ, డివైపీఎం జి. హరీష్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య, ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్‌తో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.