హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నిమ్స్‌లో అదనపు మెడికల్ సూపరింటెండెంట్, అడిషనల్ ప్రొఫెసర్ నోరి లక్ష్మీ భాస్కర్ బినామీలపై ఏసీబీ దృష్టి పెట్టింది. అతని అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా బినామీల దగ్గర భారీగా నగదు, అక్రమాస్తుల పత్రాలున్నట్టు అనుమానించిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో నగదుతోపాటు ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నోరి లక్ష్మీ భాసర్పై ఈ నెల 21న అక్రమాస్తుల కేసు నమోదైంది. ఆ రోజు జరిగిన సోదాల్లో సుమారు రూ.80 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. తాజాగా బినామీల నుంచి కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నది.
ఉద్యోగి ఇంట్లో 4.94 లక్షల నగదు
నిమ్స్‌లో పనిచేస్తున్న ధనరాజ్ అనే ఉద్యోగి ఇంట్లో రూ.4,94,394 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ప్రాంతంలో వ్యవసాయ భూములకు సంబంధించిన 3 పత్రాలు, బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ పరిధిలో ఉన్న వేంకటేశ్వర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఒక ఓపెన్ ప్లాట్‌కు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. ఈ ప్లాట్ విలువ సుమారు రూ.2.70 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. నిందితుడు లక్ష్మీ భాసర్‌తో ధనరాజ్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంది? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగి పేరుతో లక్షల పెట్టుబడులు
నిమ్స్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న డీ గణేశ్ పేరుతో ఉన్నట్లు భావిస్తున్న రెండు పెట్టుబడులకు సంబంధించిన వివరాలు కూడా గుర్తించినట్టు ఏసీబీ వెల్లడించింది. వాటి విలువ మొత్తం రూ.20 లక్షలుగా పేరొంది. ఈ పెట్టుబడులకు నిధులు ఎలా సమకూరాయి? ఇవి నోరి లక్ష్మీ భాసర్కు సంబంధించినవేనా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నది. నిమ్స్‌లో కాంట్రాక్టులు ఇవ్వడంలో లక్ష్మీ భాస్కర్ చేతివాటం చూపించేవారని తెలిసింది. డబ్బులు తీసుకుని తాతాలిక ఉద్యోగాలు కట్టబెట్టిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.