మణుగూరు టౌన్, జూలై 16 : రుణమాఫీ విషయంలో రైతుల భారం తగ్గించే కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నం చేయడమే ఎక్కువగా కనిపిస్తోందని, వడపోతలపైనే ఎక్కువగా దృష్టి సారించిందనే విషయం స్పష్టమవుతోందని భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పేది కాంగ్రెస్ నాయకులేనని, ఇది వారికి అలవాటుగా మారిందన్నారు. 2018, డిసెంబర్ 12 వరకు ముందున్న రైతులకు రుణమాఫీ వర్తించదనే నిబంధన ఎంతవరకు సబబు అని, ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అంటే లక్షలాది మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రైతులను మాయమాటలతో మభ్యపెట్టారని, అధికారం దక్కించుకున్న తర్వాత ఆంక్షలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.