ఖమ్మం, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేద, మధ్యతరగతి ప్రజల జీవనాన్ని మున్నేరు వరదలు పూర్తిస్థాయిలో దెబ్బతీశాయి. వారి కష్టమంతా వరదపాలైంది. దాదాపు ఖమ్మం నగరంలోనే సుమారు 30 వేల కుటుంబాలు వరద దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఇంట్లోని నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, విలువైన ఫర్నీచర్, దుస్తులు, ఇతర సామగ్రి మొత్తం నష్టపోయారు.
ఒక్కో ఇంటికి దాదాపుగా రూ. 2 లక్షల చొప్పున నష్టం లెక్కగట్టినా అధికారిక గణాంకాల ప్రకారం.. 5 వేల ఇళ్లకు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లవుతోంది. ఇవికాకుండా వివిధ రకాల మెటీరియల్స్, ఇతర వస్తువులు కలుపుకొని దాదాపు 15 వేల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అంచనా వేసినా మరో రూ.150 కోట్ల నష్టం వాటిల్లినట్లవుతోంది. అంటే.. కేవలం ఖమ్మం నగరంలోనే.. అదీ కుటుంబాల వారీగానే రూ.250 కోట్ల మేర నష్టం జరిగినట్లు. ఇవికాకుండా ప్రభుత్వపరంగా రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, ఇతరత్రాల నష్టమూ రూ.కోట్లలోనే ఉంటుంది.
పేద, మధ్యతరగతి ప్రజలపైనే అధిక భారం
మున్నేరు పరీవాహకంలో అత్యధికంగా పేద, మధ్యతరగతి ప్రజలే నివసిస్తున్నారు. వీరంతా పలు రకాల వస్తువులను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసి నెలవారీ ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఇంట్లో వినియోగించుకునే టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, గ్రైండర్లు, ఏసీలు, బెడ్స్ తదితర వస్తువులన్నింటినీ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నుంచి రుణంగా తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఇవే కాకుండా బైకులు, ఆటోలు, కార్లు, వ్యాన్లు, టాటా ఏస్ వంటి వాహనాలను కూడా ఇదే పద్ధతిలో కొనుగోలు చేసి వాటిని నడుపుకుంటూ జీవిస్తున్నారు.
గడిచిన పది రోజులుగా కురిసిన వర్షాలకు, మొన్న వచ్చిన మున్నేరు భారీ వరదలకు వీటిలో చాలా వరకూ అక్కడి ప్రజలు కోల్పోయారు. మరికొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. దీంతో కోల్పోయిన, దెబ్బతిన్న వస్తువుల నష్టాన్ని మొత్తం అక్కడి ప్రజలు భరిస్తూనే క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. కానీ.. ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా ఆయా వస్తువులను, ఉపాధిని కోల్పోయిన మున్నేరు పరీవాహక ప్రజలు ఈఎంఐలు చెల్లించే పరిస్థితి కోల్పోయారు. నెలవారీ అద్దెలు, కిస్తీలు, గిరిగిరీలు చెల్లించలేని కొందరైతే తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఇక బ్యాంకు రుణాల ద్వారా ఇళ్లు కొనుగోలు చేసిన వాళ్లు కూడా సదరు బ్యాంకర్లను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు.
కిక్కిరిసిన మెకానిక్ షెడ్లు
వరద ముంపునకు గురైన బైకులు, ఆటోలు, కార్లను వాటి యజమానులు రిపేరుకు తీసుకొస్తుండడంతో ఖమ్మంలోని వివిధ మెకానిక్ల షెడ్లన్నీ కిక్కిరిస్తున్నాయి. బురదతో దెబ్బతిన్న ఆయా వాహనాలకు తీవ్రతను బట్టి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చవుతోందని వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తికాని పారిశుధ్య పనులు
వరద ప్రభావం తగ్గి రోజులు గడుస్తున్నా పారిశుధ్య పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. కాల్వొడ్డు, బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్ ప్రాంతాల్లో వ్యర్థాలు ఇంకా రోడ్లపైనే ఉన్నాయి.
కిస్తీల చెల్లింపులకు గడువు ఇవ్వాలి..
ప్రభుత్వం ముం దస్తు సమాచారం ఇవ్వకపోవడంతో మా ఇళ్లన్నీ మునిగిపోయాయి. మా ఇం ట్లోని వస్తువులన్నింటినీ కోల్పోయాం. మరికొన్ని వస్తువులు పాడయ్యాయి. వాయిదాల పద్ధతిలో కొనుక్కున్న వస్తువులకు ఇప్పుడు మేము కిస్తీలు కట్టే పరిస్థితిలో లేము. కిస్తీల చెల్లింపులకు గడువు పెంచితే బాగుంటుంది.
-ఎలుగు పద్మ, జూబ్లీపుర
ప్రతి ఇంటికి రూ.లక్ష ఇవ్వాలి
సీఎం రేవంత్రెడ్డి పదిహారు వేలు ఇస్తానని అంటున్నాడు. అవి దేనికి సరిపోతాయి? ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయాయి. ఎంతో కష్టపడుతూ ఏడాదికొకటి చొప్పున కొనుక్కున్నాం. ఇప్పుడవన్నీ వరదపాలయ్యాయి. ఇంట్లో ఉన్న క్వింటాళ్ల బియ్యమూ తడిసి ముద్దయ్యాయి. ఇన్నాళ్లూ ఆకలితోనే ఉన్నాం. ఈ రోజే గ్యాస్ ముట్టించాం. అంతా నష్టపోయిన మాకు పరిహారం ఇవ్వాలి. ఇంటికీ కనీసం రూ.లక్ష చొప్పున ఇవ్వాలి.
-దుర్గాలక్ష్మి, జూబ్లీపుర
ఈఎంఐలకు వెసులుబాటు ఇవ్వాలి
వరద కారణంగా మా రిఫ్రిజిరేటర్ మునిగింది. మొత్తానికే పాడైంది. దాని ఈఎంఐ రూ.3,200 కట్టాలి. వరదకు సర్వం కోల్పోయిన మేము.. ఇప్పుడు వాటిని కట్టే స్థితిలో లేము. కరోనా సమయంలో ఇచ్చిన మాదిరిగా రెండు నెలలపాటు ఈఎంఐలకు గడువు ఇవ్వాలి. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి.
-శివరామకృష్ణ, సారథి నగర్
రూ.2 లక్షల వస్తువులు నష్టపోయాం..
మున్నేరు వరదల వల్ల మా ఇంట్లోని రూ.2 లక్షల విలువైన వస్తువులను నష్టపోయాం. ఇంట్లో సీలింగ్ పోయింది. ఆ నష్టం వేరే. ప్రతి నెలా రూ.70 వేలకు పైగా కిస్తీలు చెల్లించాలి. ఇందులో గృహ రుణం కూడా ఉంది. వరదల కారణంగా మొత్తం నష్టపోవడం వల్ల ఈ ఈఎంఐలు చెల్లించే పరిస్థితిలో లేము. మమ్ములను ప్రభుత్వమే ఆదుకోవాలి.
-మంగ శ్రీశైలం, వెంకటేశ్వనగర్
పేదల గురించి ప్రభుత్వం ఆలోచించాలి..
మున్నేరు వరదల కారణంగా ఇక్కడి ప్రజలు ఎంతో కోల్పో యాం. ముఖ్యంగా మాలాంటి పేదల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇళ్లను, ఇళ్లలోని వస్తువులను కోల్పోయిన మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈఎంఐలు చెల్లిస్తూ ఇంట్లోని వస్తువులు సమకూర్చుకుంటున్నాం. ఇప్పుడు వరదల వల్ల ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు.
-గుడిపల్లి దివ్య, జూబ్లీపుర