కూసుమంచి/ ఖమ్మం రూరల్/ తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 11: ‘వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగింది. ఆదుకోండి సారూ..’ అంటూ కేంద్ర బృందం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన వరద బాధిత రైతులు.
ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో ఇళ్లు, పంటలు, రహదారులు, వంతెనలు దెబ్బతిన్న విషయం విదితమే. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందం అధికారులు బుధవారం ఈ మండలాల్లో పర్యటించారు. దీంతో వరద బాధితులు, రైతులు తమ ఆవేదనను కేంద్ర బృందానికి వినిపించారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కూడా నష్ట తీవ్రత గురించి కేంద్ర అధికారులకు వివరించారు.
కూసుమంచి మండలంలో పర్యటించిన కేంద్ర అధికారులు.. పంటల నష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వరద తీవ్రత వల్ల తెగిన రహదారులు, సాగర్ కాలువకు పడిన గండ్లు, మునిగిన భక్తరామదాసు ప్రాజెక్టు మోటర్లు, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించారు. తరువాత ఇదే మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను కూడా పరిశీలించారు.
కోక్యాతండాకు చెందిన వడ్తియా నర్సింహారావుతోపాటు మల్లాయిగూడెం రైతులతో కేంద్ర అధికారులు మాట్లాడారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందంలో సెంట్రల్ టీం అధికారులు కే.ప్రతాప్‌సింగ్, మహేశ్‌కుమార్, శాంతి స్వరూప్, కుషవహా, నియల్ఖాన్ సన్, శశివర్ధన్, విజయ్‌కుమార్ తదితరులు ఉ న్నారు. జిల్లా అధికారులు అభిమన్యుడు, విద్యాసాగర్, పుల్లయ్య, మంగలంపుడి వెంకటేశ్వర్లు, కోక్యానాయక్, వేణుగోపాల్‌రెడ్డి, సరిత, వాణి, రమేశ్‌రెడ్డి, మన్మథరావు, రత్నకుమారి, రామచందర్‌రావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర బృంద అధికారులు ఖమ్మం రూరల్ మండలంలోనూ పర్యటించారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. తనగంపాడులో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి పంటల నష్ట తీవ్రతను గమనించారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి ఇసుక మేట వేసిన పొలాలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అయితే, తమ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ప్రకటించిన రూ.10 వేల పరిహారం ఏమాత్రమూ సరిపోదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కస్నాతండాలోనూ ధ్వంసమైన ఇళ్లను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ మధుసుదన్‌నాయక్, ఇతర అధికారులు గణేశ్, పుల్లయ్య, మధుసూదన్, సరిత, అపర్ణ, ఉమా నగేశ్ పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం మండలంలో పర్యటించిన కేంద్ర అధికారుల ఎదుట వరద బాధితులు బోరున విలపించారు. అన్ని విధాలా నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ వేడుకున్నారు. బంధంపల్లి, రాకాశితండా, రావిచెట్టుతండా గ్రామాల్లో పర్యటించిన కేంద్ర అధికారులు.. ఆకేరు ప్రవాహానికి, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను, దెబ్బతిన్న ఇళ్లను, జరిగిన నష్టాన్ని పరిశీలించారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సిలార్, ఏవో సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.