తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 8: ‘భారీ వర్షాలతో ఆకేరులో వచ్చిన వరద ప్రవాహానికి ఇళ్లు మునిగి, పంటలు కొట్టుకపోయి సర్వం కోల్పోయామయ్యా.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.. మమ్ములను మీరే కాపాడాలె సారూ..’ అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని వరద బాధితులు వేడుకున్నారు. వరద విషాదాన్ని వివరిస్తూ దండం పెట్టి బోరున విలపించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఆదివారం ఖమ్మం జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. తిరుమలాయపాలెం మండలం రాకాశితండాను పరిశీలించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి ఆకేరు ప్రవాహానికి నీటి మునిగి నష్టపోయిన ఇళ్లను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాకాసితండాలో వరద ప్రవాహానికి తీవ్రంగా నష్టపోయిన జర్పుల సక్రీ, పోతుగంటి శాంతమ్మ, భూక్యా అచ్చమ్మ, బానోత్ శారద, పోతుగంటి సహదేవ్, భూక్యా వెంకన్న తదితరులు బోరున విలపిస్తూ మంత్రులకు దండం పెడుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రజలను, రైతులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.