కారేపల్లి: ఖమ్మం జిల్లా (Khammam) కారేపల్లి మండలంలోని బొక్కల తండాలో విద్యాదాఘాతంతో ఐదు బర్రెలు మృతిచెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల వీచిన ఈదురుగాలులకు బొక్కల తండాకు చెందిన హాతీరామ్ పంటచేలు వద్ద ఆరు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కరెంటు వైర్లు నేలపై పడిపోయాయి. ప్రమాదం పొంచి ఉండటంతో విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ లైన్లో కరెంటు సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. అయినప్పటికీ అధికారులు కరెంటు సప్లయ్‌ని ఆపలేదు.
కాగా, శుక్రవారం ఉదయం తన ఇంటి వద్ద బర్రెలను పాలు పితికి మేతకు తోలాడు. అయితే పంట చేలో నేలపై పడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి నాలుగు బర్రెలపాటు ఒక దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పశువులు మృతి చెందాయని బాధిత రైతు హాతీరామ్ ఆరోపించారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. ఘటన స్థలానికి సంబంధిత శాఖ అధికారులు ఎవరూ రాకపోవడంతో గ్రామస్తులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.