రఘునాథపాలెం, జూన్ 5 : ‘కొడుకును మంచి చదువులు చదివించాలి.. పెద్ద ఇంజినీర్‌ను చెయ్యాలి’.. ‘కూతుర్ని పెద్ద డాక్టర్‌ను చెయ్యాలి.. కలెక్టర్‌ను చెయ్యాలి’ ఇదీ నేటి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై కంటున్న కలలు.. పెట్టుకుంటున్న ఆశలు. నిరుపేదలు సైతం తామున్న స్థితికి భిన్నంగా తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకు వారు ‘ప్రైవేటు విద్యాసంస్థ’లనే ఎంచుకుంటున్నారు. కష్టం మొత్తం వారు భరిస్తూ పిల్లలకు ఖరీదైన చదువులు చెప్పిస్తున్నారు. కానీ, ఆయా పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న పిల్లలు ఇంటికి చేరుకోకుండానే అనంతలోకాలకు వెళ్తుండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కారణం ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన ‘బస్సులే’. కోటి ఆశలతో తమ పిల్లలను బస్సెక్కించి బడికి పంపిస్తున్న తల్లిదండ్రులకు అదే బస్సు పుట్టెడు శోకం మిగుల్చుతోంది.
‘ఒకచోట స్కూల్ బస్సు వాగులో పడితే.. మరోచోట అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని లేదా డివైడర్‌ను ఢీకొడుతూ ప్రమాదం.. ఆ దుర్ఘటనల్లో చిన్నారి విద్యార్థులు మృత్యుఒడిలోకి వెళ్లటం పరిపాటిగా మారుతోంది. అయినా ధనార్జనే ధ్యేయంగా మారిన ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల్లో పిల్లలను తరలించే క్రమంలో ఎటువంటి నిబంధనలు పాటించడం లేదనేది వాస్తవం. రవాణా శాఖ అధికారులు సైతం ఏటా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇచ్చే కాసుల కక్కుర్తికి అలవాటుపడి చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏటా తనిఖీలు చేపడుతున్నామని చెబుతున్న రవాణా శాఖ అధికారుల మాటలు నీటిపై రాతల్లాగే ఉంటున్నాయి. దీంతో తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో విద్యార్థులను తరలిస్తుంటారు. అందుకు అనుగుణంగా బస్సులు ఫిట్‌గా ఉండాలి. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు విధిగా చేయించుకోవాలి. ప్రైవేటు పాఠశాలల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు సైతం దృష్టి సారించారు. ఖమ్మం జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు చెందిన మొత్తం 814 బస్సులు ఉన్నాయి. వాటిలో గురువారం నాటికి కేవలం 393 బస్సులకు మాత్రమే అధికారులు ఫిట్నెస్ పత్రాలను జారీ చేశారు. అంటే.. ఇంకా సగానికి పైగా బస్సులు ఫిట్నెస్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంది. ఈ నెల 11వ తేదీలోగానే అన్ని విద్యాసంస్థలు తమ బస్సులకు ఫిట్నెస్ టెస్ట్‌లు చేయించాలి. గడువు దాటితే జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. 15 ఏళ్లు నిండిన బస్సులకు ఫిట్నెస్ చేయలేమని, అలాంటి వాహనాలను ఫిట్‌నెస్‌కు తీసుకురావద్దని సూచిస్తున్నారు.
బస్సుల్లో మెడికల్ కిట్లు, గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలు, పిల్లలు కిందపడకుండా సీట్ల మధ్యలో రాడ్లు అమర్చాలి. బస్సులోకి ఎక్కేందుకు, దిగేందుకు అనుకూలంగా మెట్లు ఉండాలి. అత్యవసర ద్వారం తప్పనిసరి. డ్రైవర్‌కు కనబడేలా రెండువైపులా పెద్ద అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలీ అమర్చాలి. అలాగే వాహనం టైర్లు, బ్రేక్‌లు నాణ్యంగా ఉండాలి. ఏ పాఠశాలకు చెందినదో తెలిపేలా పూర్తి వివరాలు బస్సుపై రాయాలి. బస్సుకు నాలుగువైపులా స్టిక్కర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కనీసం ఐదేళ్ల అనుభవంతో 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి.
జిల్లాలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులన్నీ ఈ నెల 11వ తేదీలోగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్నెస్ లేకుండా విద్యార్థులతో రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తాం. 12వ తేదీ నుంచి రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రధాన పట్టణాల్లో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఫిట్‌నెస్‌లేని బస్సుల్లో విద్యార్థులను తరలించడం నేరం. బస్సులను సీజ్ చేస్తాం. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదు చేసేలా బస్సు వెనకాల ప్రిన్సిపాల్ ఫోన్ నెంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి.
– జేఎన్ శ్రీనివాసరావు, ఇన్చార్జి డీటీవో