ఖమ్మం, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు బుధవారం తెల్లవారు జామున నుంచి నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జరిగిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ఇతర శాఖల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సత్తుపల్లి డిపో నుంచి బస్సులను బలవంతంగా తిప్పేందుకు డిపో అధికారులు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు ప్రతిఘటించారు. తాము సమ్మెలో ఉండగా బస్సులను ఎలా నడుపుతారని వాగ్వాదానికి దిగారు. బస్సులను డిపో నుంచి బయటకు రానివ్వలేదు. దీంతో కొంత అక్కడ కొంత స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులను మాత్రం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బుధవారం నడిపించారు.
ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల్లో ఆర్టీసీ 315 బస్సులను నడపాల్సి ఉండగా కేవలం 29 బస్సులను మాత్రమే నడిపింది. అలాగే, ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సుల్లో 125 బస్సులను నడిపించారు. కండక్టర్లు పూర్తిస్థాయిలో సమ్మెలో ఉండడంతో కేవలం డ్రైవర్లతోనే బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపించింది. ఎలాగైనా బస్సులను నడపాలని ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రభుత్వం.. బుధవారం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి టికెట్లు జారీ చేయకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఖమ్మం రీజియన్‌లో 544 బస్సులు తిరగాల్సి ఉండగా 154 బస్సులు తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

అన్ని డిపోల వద్దకు ఉద్యోగులు బుధవారం తెల్లవారు జామున 4 గంటలకే చేరుకున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మిక సంఘాల గుర్తింపును పునరుద్ధరించాలని, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నడపాలని, ఉద్యోగుల బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసుల ఎస్కార్ట్‌తో ఆర్టీసీ బస్సులను నడపడానికి ప్రయత్నించారు.
ఆయా డిపోల్లో ఉద్యోగులు ఆందోళన చేయడంతో కొన్ని బస్సులను నడపకుండా వెనక్కి తీసుకెళ్లారు. అద్దె బస్సులను మాత్రం ఆయా ప్రాంతాల్లో యథావిధిగా నడిపారు. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగే అవకాశం ఉండడంతో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిపోల వారీగా ఆర్టీసీ అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారిని తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్, సీపీఐ, ఏఐటీయూసీ మద్దతు పలికాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,985 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, బీకేయూ కార్మిక పరిషత్‌తోపాటు ఇతర సంఘాలు జేఏసీగా ఏర్పాటై పాల్గొన్నాయి. అయితే, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు జేఏసీలో భాగమైనప్పటికీ సమ్మెకు మాత్రం మద్దతు ఇచ్చారు. బుధవారం నాటి తొలిరోజు సమ్మెలో ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, మెకానిక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ మొండివైఖరిని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిన అంశాలను అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.