ములకలపల్లి, మార్చి 23: ములకలపల్లి మండలం కమలాపురంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం పది గంటల సమయంలో స్టోర్ రూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. మిగతా రూములకు పొగ వ్యాపించింది. దీనిని గమనించిన విద్యార్థులు భయంతో వసతిగృహం నుంచి ఆవరణలోని చెట్ల కిందకు పరుగులు తీశారు.
ఆదివారం సెలవు దినం కావడంతో మొత్తం 230 మంది విద్యార్థులూ వసతిగృహంలోనే ఉన్నారు. ఇటీవల వీరికి కొత్తగా పరుపులు వచ్చాయి. దీంతో పాత పరుపులను తీసుకెళ్లి సెకండ్ ఫ్లోర్లోని స్టోర్ రూమ్లో ఉంచారు. అదే రూంలో విద్యుత్ సార్ట్ సర్క్యూట్ జరగడంతో పరుపులకు మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్న క్రీడాసామగ్రి, పరుపులు అగ్నికి ఆహుతయ్యాయి. మూడు నాలుగు గంటలు గడిచినా అదుపులోకి రాలేదు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్ తన సిబ్బందితో చేరుకున్నారు.
ఫైర్ సిబ్బంది కూడా వచ్చి మంటలను ఆర్పారు. అయితే, ప్రమాదం రాత్రివేళ సంభవించి ఉంటే తీవ్రత ప్రమాదకరంగా ఉండేదని, ప్రాణనష్టం కూడా పెద్ద ఎత్తున జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం పది గంటల సమయంలో స్టోర్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు పంపామని వసతిగృహం వార్డెన్ నాగప్రత్యూష తెలిపారు. ప్రమాద సమయంలో ఆ రూమ్లో ఉన్న 300 పాత పరుపులు, క్రీడాసామగ్రి ఉన్నట్లు చెప్పారు.