కారేపల్లి, ఆగస్టు 12 : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ అన్నార. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్. పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి జానకి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూ.8 వేల కోట్ల పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గురుకుల పాఠశాలల్లో రోజుకొక ఫుడ్ పాయిజనింగ్ ఘటనలతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ పేరుతో కాలయాపన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు అజయ్, అభి, కారేపల్లి మండల నాయకులు సంజయ్, లోకేశ్, చందు, వేణు, ఉషశ్రీ, సంధ్య, సాయి, అఖిల్, హేమంత్, ప్రవీణ్, జస్వంత్, రాజశేఖర్, హేమంత్, వినయ్ పాల్గొన్నారు.
Karepalli : ‘ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి’