ఖమ్మం, ఫిబ్రవరి 7: ప్రజలకు, రైతులకు ఇబ్బందికరంగా, నష్టదాయకంగా ఉన్న ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్ అలైన్‌మెంట్‌ను మార్చాల్సిందేనని, దానిపై పునఃపరిశీలన చేయాల్సిందేనని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్ అలైన్మెంట్ పురోగతిలో తాను ప్రతిపాదించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో లేదోనని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అడిగారు.
ఈ లైన్ కారణంగా ఇక్కడి రైతులు సారవంతమైన, విలువైన వ్యవసాయ భూములను కోల్పోతున్నారని అన్నారు. కాగా, ఎంపీ నామా ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిస్తూ.. డోర్నకల్ – మిర్యాలగూడ (97 కి.మీ.) మధ్య కొత్త రైలుమార్గం మంజూరైందని, డీపీఆర్ కోసం సర్వే జరుగుతోందని అన్నారు. రైల్వే ప్రాజెక్టుల అమరిక, కార్యాచరణ, వాణిజ్య అవసరాలు, సాంకేతిక – ఆర్థిక సాధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తదుపరి కార్యాచరణ ఉంటుందని అన్నారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.