ఈసారి లేటు వానలు అన్నదాతలకు చేటు చేసేలా ఉన్నాయి. గడిచిన రెండేళ్లుగా సకాలంలో వానలు కురిశాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో కర్షకులు కన్నీటి పర్యంతమయ్యారు. సకాలంలో రైతుభరోసా ఇవ్వక, యూరియా అందించక, చివరికి పంటలను కూడా సరైన సమయంలో కొనక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా అప్పోసప్పో చేసి తమ పంటలను తాము వేసుకుందామనుకున్న రైతులకు ఈ ఏడాది ప్రకృతి సహకరించేలా కన్పించడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే ప్రమాదం కన్పిస్తోందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం వచ్చినా ఇప్పటికీ సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో పత్తి విత్తనాలు విత్తిన రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందనే కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ‘ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా..’ అంటూ వేడుకుంటున్నారు. ముఖ్యంగా తమపై అధికంగా ప్రభావం ఉంటుందని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి విత్తనాలు విత్తి 20 రోజులు దాటినా ఇంకా వర్షాలు కురవకపోవడంతో గింజలు మొలకెత్తలేదు. మొలకలు భూమి నుంచి బయటకు రాలేదు. జూన్ నెలలో ఇప్పటి వరకు 169 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. కేవలం 82 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. కనీసం జూలైనైనా వానలు కురవకపోతే పత్తి రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.

Khammam1
జూన్ నెలలో లోటు వర్షపాతం..
వానకాలం సీజన్లో మొత్తం 1,210 మిల్లీ మీటర్లు కురవాలని వాతావరణ శాఖ లెక్కలు వేసింది. కానీ, ఈ సీజన్లో అంత వర్షపాతం నమోదు అవుతుంతో లేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి జూన్ నెలలో లోటు వానలు కురిశాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. ఇదే జరిగితే పంటల సాగుపై అధిక ప్రభావం పడే ప్రమాదం ఉంది. అశ్వాపురం, మణుగూరు, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఇప్పటికీ అసలు వర్షపాతం నమోదు కానట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఆందోళనలో పత్తి రైతులు
అధికారిక అంచనాల ప్రకారం ఈ ఏడాది 2.20 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట వేస్తున్నారు. నిరుటి కంటే ఈసారి ఎక్కువగానే వేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చాలామంది రైతులు ఇప్పటికే విత్తనాలు వేసినందున వారంతా ఆందోళన చెందుతున్నారు. నేల తడిచి విత్తనాలు మొలకెత్తే స్థాయిలో వానలు కురవాలని అంటున్నారు. లేకపోతే విత్తనాలు చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తక్కువ కాలం పంటలు వేయాలంటున్న అధికారులు
ఎల్‌నినో ప్రభావం భద్రాద్రిపై అంతగా ఉండకపోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కానీ, వాతావరణ శాఖ అధికారుల అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులకు కొన్ని ముందస్తు సూచనలు చేస్తున్నారు. తక్కువ పంట కాలం ఉండే పంటలను వేసుకోవాలని సూచిస్తున్నారు. పత్తి పంటలో అంతర్ పంటను తప్పనిసరిగా వేసుకోవాలని సూచిస్తున్నారు. కంది కూడా సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే, వరి పంటకు కూడా వానలు అంతగా అనుకూలంగా ఉండవని అంటున్నారు. తక్కువ రకాల సీడ్‌ను వేసుకొని వాతావరణ పరిస్థితుల నుంచి బయటపడాలని చెబుతున్నారు. వరిలో ఆర్ఎన్ఆర్ 5048, జై శ్రీరాం, డబ్ల్యూజీఎల్ 44, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీ 962, జేజేఎల్ 1798 రకాలు వేసుకోవాలని సూచిస్తున్నారు.
చిరు జల్లులు పడ్డాయి..
నేను ఐదు ఎకరాల ఇరవై కుంటల్లో పత్తి గింజలు వేశాను. ఇంత వరకు వర్షం కురవలేదు. చిన్న జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. మబ్బులు పడుతున్నాయి గానీ వానలు వస్తాయో రావో తెలియడం లేదు. పంటల కోసం చాలా ఖర్చు పెడుతున్నాం. మొలకలు కనబడుతున్నాయి పైకి రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పంట రాకపోతే ప్రభుత్వమే ఆదుకోవాలి.
-జాటోత్ నెహ్రూ, రైతు, టేకులపల్లి
ఐదెకరాల్లో పత్తి గింజలు వేశా..
ఐదెకరాల్లో పత్తి గింజలు చేశాను. పది రోజులైనా వాన జాడలేదు. అప్పు తెచ్చి మరీ ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. కనీసం మొలకలు కూడా కనబడటం లేదు. చినుకుల కోసం ఎదురు చూస్తున్నాను. నిరుడు కూడా పత్తి పంటే వేశాను. కానీ, ధర పలకలేదు. సీసీఐ కొనలేదు. బయటే అమ్ముకున్నా. ఈసారి ఏమవుతుందో ఏమో చూడాలి. వానలు కురవాలని దేవుడి మీద భారం వేశాం.
-భూక్యా లక్ష్మణ్, బద్దుతండా, టేకులపల్లి
ఎల్‌నినో ప్రభావం తక్కువే..
చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ చూపించారు. భద్రాద్రి జిల్లా అందులో లేదు. కానీ, ముందు జాగ్రత్త చర్యలుగా తక్కువ కాలం పంటలను వేయాలని రైతులు చెప్పాం. పత్తిలో కూడా అంతర్ పంటను వేయాలని పదే పదే చెబుతున్నాం. రైతులు మా సూచనలను పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా పంటలు సాగు చేస్తే నష్టాల ప్రమాదం తగ్గించుకోవచ్చు. ఈసారి వానలు తగ్గే అవకాశాలున్నందున రైతులు స్థానిక ఏవోల సలహాలు తీసుకోవాలి.
-వేల్పుల బాబూరావు, డీఏవో, భద్రాద్రి