ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 29 : ఆరుగాలం కష్టించి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి, ఇంటిల్లిపాదీ చెమటోడ్చి పంటలు పండించిన అన్నదాతలు ధరల విషయంలో దారుణంగా దగా పడుతున్నారు. ‘సొమ్మొకరిది.. సోకొకరిది..’ అనే నానుడి చందంగా వారి కష్టం వేరొకరికి ఫలాలను అందిస్తోంది. దీంతో తమ పంటలకు మద్దతు ధర కావాలంటూ అన్నదాతలు నెత్తీనోరూ బాదుకున్నా..
ప్రభుత్వం మారు మాట్లాడిన పాపానపోవడం లేదు. దీంతో ‘మద్దతు ధర మిథ్యే..’ అన్నది తథ్యంగా కన్పిస్తోంది. పెసలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక కర్షకులు దగా పడుతుంటే.. ప్రైవేటు మార్కెట్లో ఖరీదుదారులు సిండికేట్ అయి దర్జాగా ధనార్జన చేస్తున్నారు. ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..’ అనే సామెతను గుర్తు చేస్తూ.. తాము తలుచుకుంటే ధరను ఎంతైనా పడగొట్టగలమని రుజువు చేస్తున్నారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే భారీగా పతనమైన పెసర ధరే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.
ఒక్కరోజు దెబ్బ.. ఆరుగాలపు కష్టం వృథా..
అన్నదాతల ఆరుగాలపు శ్రమ ఒక్కరోజులోనే వృథా అవుతోంది. రైతులకు మంచి మద్దతు ధర కల్పించడమే తమ ధ్యేయమంటూ చెప్పుకొని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత పాలకులు తీరా పంటల సమయం వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. మద్దతు ధర మాటలను కాగితాలపై చూపిస్తున్నారు తప్ప ఆచరణలో అన్నదాతలకు ఆవగింజంత ఆర్జననూ అందించడం లేదు. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక్క ఎండు మిర్చికి తప్ప.. వరి, పత్తి, అపరాలు, ఇతర సుగంధ ద్రవ్యాల పంటలకు మద్దతు ధర ఉంది. కానీ.. ఆ మద్దతు ధర అన్నదాతకు అందడం లేదు.
దిగుబడి పెరగ్గానే ధరను దించేశారు..
అన్నదాతలు ఈ వానకాలం సీజన్లో సాగు చేసిన పంటల్లో పెసర ఒకటి. అంచనాలను దాటి ఈ ఏడాది సుమారు 14 వేల ఎకరాల్లో సాగైంది. సాధారణంగా ఏటా పెసర పంట చేతికొచ్చే సమయంలో వాన ముసుర్లు వస్తుంటాయి. దీంతో చేతికొచ్చిన పంట రాలిపోతుంటుంది. కానీ.. ఈ ఏడాది ఇప్పటి వరకూ పొడి వాతావరణం ఉండడంతో నాణ్యమైన పంట చేతికొచ్చింది. దిగుబడి పెరిగింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అవేమీ చేయలేదు. దీంతో ప్రైవేట్ మార్కెట్లో ఖరీదుదారులు చెప్పిన ధరకే రైతులు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రైవేట్ మార్కెట్లో నిలువు దోపిడీ..
గడిచిన వారం రోజులుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్త పెసర పంట వస్తోంది. జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల రైతులు ఇక్కడికే తమ పంటను తెస్తుంటారు. కొద్ది రోజుల క్రితం కేరళ, తమిళనాడుల్లో భారీ వర్షాలకు అక్కడి అపరాల పంటలు తుడిచిపెట్టుకపోయాయి. దీంతో అక్కడి వ్యాపారులు నారాయణపేట, తాండూర్ ప్రాంతాలకు వచ్చి భారీగా కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం మార్కెట్లోనూ ప్రైవేట్ ధర పెరగాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా ఇక్కడి వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. పంట సన్నగా ఉందని, పచ్చదనం లేదని సాకులు చెబుతూ క్వింటాకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకూ ధరను తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నారు. బుధవారం అపరాలకు ఖమ్మం ఏఎంసీలో క్వింటాకు రూ.7,100 వెచ్చించిన ఖరీదుదారులు.. గురువారం ఉదయం క్వింటాకు రూ.6,630 మాత్రమే ధర నిర్ణయించడం గమనార్హం.
మద్దతు ధర ఉంటే రూ.40 వేలు కోల్పోయేవాడిని కాదు..
ఈరోజు ఖమ్మం మార్కెట్లోని అపరాల యార్డుకు నాతోపాటు చాలా మంది రైతులు పెసర పంటను తెచ్చారు. ఖరీదుదారులు అందరి పంటలనూ పరిశీలించారు. చివరికి నా పంట నెంబర్ వన్‌గా ఉందని తేల్చారు. జెండాపాట నిర్వహించినప్పటికీ నా పంటకు మాత్రం క్వింటాకు రూ.6,830 ధర పెట్టారు. నేను 20 క్వింటాళ్ల పంటను తెచ్చాను. అయితే, ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధర రూ.8,682 ప్రకారం కొనుగోలు చేసి ఉంటే నేను మరో రూ.40 వేల ఆదాయాన్ని పొందేవాడిని. ప్రైవేటులో క్వింటాకు సుమారు రూ.2 వేలు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల నేను ఆ రూ.40 వేల ఆదాయాన్ని కోల్పోయాను.
-జంగాల రమేశ్, రైతు, పాతర్లపాడు, చింతకాని
ఒకటి రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తాం..
పెసర కొనుగోళ్లకు ఒకటి రెండు రోజుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలంటూ ప్రభుత్వం నుంచి బుధవారమే ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌కు పంట భారీగా వస్తోంది. జిల్లా ఉన్నతాధికారుల అనుమతితో ఈ రెండు రోజుల్లోనే ఖమ్మం ఏఎంసీలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. డీసీఎంఎస్ ద్వారా పంటను కొనుగోలు చేస్తాం.
-సునీత, మార్క్‌ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్
ఖమ్మం జిల్లాలో పెసర సాగు విస్తీర్ణం : 14,500 ఎకరాలు
దిగుబడి అంచనా : 40 వేల క్వింటాళ్లు
పెసర మద్దతు ధర (క్వింటాకు) : రూ.8,682
ప్రైవేట్ మార్కెట్ ధర (క్వింటాకు) : రూ.6,830
రైతులు కోల్పోయే ధర వ్యత్యాసం : రూ.1,852