నెట్వర్క్ ;పోడు పట్టాల పంపిణీతో గిరిజన గూడేల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామగ్రామానికి వెళ్లి అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేస్తున్నారు. పట్టాలు అందుకున్న రైతులు సంబురపడుతున్నారు. గత ప్రభుత్వాలు మమ్ములను ఓటర్లుగానే చూశారే తప్ప మా సమస్యలు పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వంలో మా బాధలు తీర్చేందుకే పట్టాలు అందించిన సీఎం కేసీఆరే దేవుడు అని కొనియాడుతున్నారు.
రూపాయి ఖర్చు లేదు
రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే సర్వే చేసి పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం పోడు భూమికి పట్టాలు అందించి మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఏళ్లనాటి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీఎం కేసీఆర్కు గిరిజనులమంతా అండగా ఉంటాం.
–బాదావత్ మంగమ్మ, శ్రీరాంనగర్తండా, కామేపల్లి మండలం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
పోడు భూమికి పట్టాలు అందించిన సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా గిరిజన రైతులకు పట్టాలు అందించారు. గత పాలకులు పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి మాట తప్పారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.
–కొర్ర చిలకమ్మ, ఊటుకూరు, కామేపల్లి మండలం
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం
ఏండ్ల తరబడి పోడు పట్టాల కోసం పోరాడుతున్నం. ఫారెస్టోళ్లతోని యుద్ధం చేసినం. మాపై కేసులు కూడా పెట్టిండ్రు. పోడు పట్టా చేతికొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటం. మా కుటుంబమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
–కొమరం రత్తమ్మ, పోడు రైతు, పోట్లపల్లి, పినపాక మండలం
పట్టా వస్తదని ఊహించలే..
పోడు భూములకు పట్టాలు వస్తాయని కలలో కూడా ఊహించలే. దేవుడి రూపంలో ఉన్న సీఎం కేసీఆర్ మా బాధలు ఆలకించిండు. జూన్ వచ్చిందంటే ఏటా ఫారెస్టోళ్లతోని పంచాయితీ అయ్యేది. పట్టాచేతికందేసరికి ఆనందంగా ఉంది. రైతుబంధు కూడా వస్తదని చెప్తున్రు. ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
-కోరం ముసలయ్య, పోడు రైతు, తోగ్గూడెం, పినపాక మండలం
సాగుదారులందరికీ పట్టాలు
మండలంలో అటవీ హక్కుల చట్టం-2005 కంటే ముందు పోడు సాగు చేసుకుని జీవిస్తున్న గిరిజనుల పోడు భూములను అధికారులతో కలిసి సర్వే నిర్వహించాం. అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలు అందించిన సీఎం కేసీఆర్కు, పట్టాల పంపిణీకి కృషి చేసిన ప్రభుత్వ విప్ రేగాకు కృతజ్ఞతలు.
–కాయం శేఖర్, పోడు భూముల డీఎల్సీ మెంబర్