అసలే అదును రోజులు. అందునా మాంచి వ్యవసాయ సీజన్. పొద్దు పొద్దున్నే లేచి పొలం బాట పట్టే రైతులందరూ ఇప్పుడు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పరుగుపరుగున వెళ్లి పరపతి సంఘాల వద్ద బారులు తీరుతున్నారు. అక్కడ సరైనా సమాచారం లేకపోవడమో, రుణమాఫీ కాలేదన్న సమాధానం రావడమో జరగగానే.. అదే పరుగున వ్యవసాయ శాఖ కార్యాలయలకూ చేరుకుంటున్నారు. అక్కడా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
అక్కడ సరైన సమాచారం దొరికిందా సరేసరి. లేదంటే అంతులేని ఆవేదన చెందుతున్నారు. తన సహజ నైజమైన ఓర్పును మరికొంత మూటగట్టుకొని, తనను తాను ఓదార్చుకొని, ఇంకొంత నిట్టూర్చుకొని మరో ప్రయత్నంగా ఇంకోసారి దరఖాస్తులు అందజేస్తున్నారు. ‘మా పంట రుణాలను ఇప్పటికైనా ప్రభుత్వం మాఫీ చేయకపోతుందా?’ అన్న ఆశతో, ‘ఇప్పటికే సాగుకు అదును దాటిపోతుందే?’ అన్న ఆవేదనతో వెనుదిరుగుతున్నారు.
కానీ, వీరి ఓర్పునకు గానీ, నిట్టూర్పునకు గానీ ప్రభుత్వం పెద్దగా స్పందించిన దాఖలాలు ఎక్కడా కన్పించడం లేదు. చేస్తామన్న చేతలను, ఇచ్చిన గ్యారెంటీ హామీలను ఇప్పటికే పక్కనబెట్టింది. ఆపై ఇప్పటిదాకా మాటలతోనే నెట్టుకొచ్చిన ఈ ప్రభుత్వం.. ఇకపై ఈ అన్నదాతల ఆవేదనను ఆలకిస్తుందన్న ఆశ అనుమానంగానే కన్పిస్తోంది. అదునులో అరగంట ఆలస్యమైనా పంటల దిగుబడి తగ్గే ప్రమాదమున్నందున.. అర్ధరాత్రిలోనూ అప్రమత్తంగా ఉండే అన్నదాతలు ఈ రుణమాఫీ పుణ్యమా అని అరిగోస పడుతున్నారు. ఇటు పంటల పదును అదునుమీద ఉన్న వేళ.. ఇటు పంట రుణాలు మాఫీగాక హలధారులు అల్లాడుతున్న తీరుపై ప్రత్యేక కథనం..
– ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 23
సాధారణంగా రాయితీ విత్తనాల కోసమో, పంటలకు ఎరువుల కోసమో, కొత్తగా పంట రుణాల కోసమో పరపతి సంఘాల వద్ద బారులు తీరి కన్పించే రైతులు.. ఇప్పుడు తమ పంట రుణాలు ఎందుకు మాఫీ కాలేదో తెలుసుకునేందుకు గుంపులుగుంపులుగా కన్పిస్తున్నారు. జిల్లాలోని 76 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఎస్సీఎస్), బ్యాంకుల వద్ద కన్పిస్తున్న వారిలో సగం కంటే ఎక్కువమంది రైతులు.. పదును మీద ఉన్న తమ పంటలను వదిలి వచ్చిన వారే. ఈ కార్యాలయాల పనివేళలు ఉదయం 10 గంటలకు మొదలు కావాల్సి ఉన్నా కర్షకులు మాత్రం ఉదయం ఏడెనిమిది గంటల నుంచే క్యూలు కడుతున్నారు.
రూ.లక్షలోపు, రూ.లక్షన్నరలోపు, రూ.2లక్షల్లోపు రుణాలను ఒకటి, రెండు, మూడు విడతల్లో మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి అన్ని విడతల కోసమూ ఆశగా ఎదురుచూశారు. ప్రతి విడతలోనూ కొద్ది మంది రైతులకే రుణమాఫీ అవుతూ వచ్చింది. మూడు విదతలూ ముగిసే సరికి మాఫీ కానివారే మిక్కిలిగా ఉన్నారు. దీంతో వారంతా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్లి మరోసారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. కన్పించిన ప్రతి అధికారినీ కలిసి కన్నీటిపర్యంతమవుతున్నారు. తన పంట రుణం మాఫీ అయ్యేలా చూడాలంటూ వేడుకుంటున్నారు.
ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పటికే రైతువేదికల వద్ద ఏఈవోలకు దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రజావాణిలో వినతులూ సమర్పిస్తున్నారు. ఇక జిల్లాలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్‌కు ఏకంగా పదివేలకు పైగానే ఫిర్యాదులు అందినట్లు సమాచారం ఉంటున్నదంటే అన్నదాతల ఆక్రందన ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరోసారి రెండు రోజుల నుంచి ప్రత్యేక ఫార్మాట్లో ప్రభుత్వం తయారు చేసిన దరఖాస్తు ఫారాలను మండల వ్యవసాయశాఖ అధికారులకు అందజేస్తున్నారు. అయితే, పలు దఫాలుగా ఫిర్యాదులు అందజేసినా తమకు ఎక్కడా కచ్చితమైన సమాచారం అందడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ వచ్చిందో రాలేదో తెలుసుకునేందుకు దాదాపు నెల రోజుల్నుంచి తిరుగుతున్నాను. ఏదులాపురం సొసైటీలో రూ.46 వేలు, కెనరా బ్యాంకులో మరో రూ.1.60 లక్షల పంట రుణం తీసుకున్నాను. రూ.2 లక్షలకు పైబడి పంట రుణం తీసుకున్నా. ఆ పైబడిన నగదును బ్యాంకులో కట్టాలని మా ఊరు వాళ్లు చెబితే రోజూ వచ్చి అధికారులను అడుతున్నాను. సొసైటీలో కట్టాలా? బ్యాంకులో కట్టాలా? అని అడిగిన ప్రతిసారీ కొద్దిరోజులు ఆగమని చెబుతున్నారు. ఎక్కడ కట్టాలో, ఎంత కట్టాలో చెప్పడం లేదు. ఎక్కడ తిరిగినా సక్కగ సమాధానం రావడం లేదు.
-మందా వెంకటయ్య, రైతు, మంగళగూడెం, ఖమ్మం రూరల్
మాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండేళ్ల కిందట టేకులపల్లి సొసైటీలో రూ.80 వేల పంట రుణం తీసుకున్నా. తొలి జాబితాలోనే నా పేరు రావాల్సి ఉంది. కానీ ఏ జాబితాలోనూ రాలేదు. దీంతో అధికారులను అడిగాను. రేషన్‌కార్డు లేదు కాబట్టి నా రుణమాఫీ ఆపేశారని చెబుతున్నారు. రేషన్‌కార్డు లేనివాళ్ల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకూ ఆగాలని అంటున్నారు. ఆ ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో ఏమో? అసలు నా పంట రుణం మాఫీ అవుతుందో కాదో అర్థం కావడం లేదు.
-గుడిపాటి వెంకటేశ్వర్లు, రైతు, తెల్దారుపల్లి, ఖమ్మం రూరల్
గత కేసీఆర్ ప్రభుత్వంలో నాకు రుణమాఫీ వచ్చింది. రూ.9 వేల వరకు కట్టాల్సి ఉండగా ఏదులాపురం సొసైటీలో కట్టాను. రెండు బ్యాంకుల దగ్గర వద్దనుకొని కొన్నేళ్ల క్రితం కెనరా బ్యాంకులోనే రూ.1.50 లక్షల పంట రుణం తీసుకున్నా. కానీ నా రుణం మాఫీ కాలేదు. ఎందుకని అడిగితే సొసైటీలో కూడా అప్పున్నది కాబట్టి రుణమాఫీ కాలేదని చెబుతున్నారు. దానిని అప్పుడే కట్టాను. కానీ కట్టనట్టుగా ధరణిలో చూపిస్తోందని చెబుతున్నారు. నేను సొసైటీ అప్పు కట్టగానే అక్కడ నా పేరును తొలగించకపోవడం వల్లనే నా రుణం మాఫీ కావట్లేదు.
-మామిడి సుబ్బయ్య, రైతు, సత్యనారాయణపురం
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా పంట రుణం మాఫీ చేయలేదు. ఎందుకు మాఫీ చేయలేదో తెలుసుకుందామని ఆఫీసుల చుట్టూ తిరగాలంటే పానం పోతంది. మాది మంగళగూడెం గ్రామం. నా కోడలు పేరు మీద, నా పేరు మీద పంట రుణాలు తీసుకున్నాం. ఇద్దరి రుణాలు కలిసి రూ.2 లక్షల వరకు ఉన్నాయి. కానీ మా రుణాలు మాఫీ కాలేదు. నెలరోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా. పక్షపాతంతో నా పెనుమిటి ఇంటికే పరిమితమైండు. జ్వరం వల్ల కొడుకు లేవడం లేదు. మంగళగూడెంలో అడిగితే మండలానికి పొమ్మన్నారు. మండలానికి వచ్చి అడగితే కామంచికల్ రైతు వేదికకు వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లి అడిగా నా పేరు లేదన్నారు. కుటుంబంలో ఒక్కరికే రేషన్‌కార్డు ఉందని కాబట్టి రుణం మాఫీ కాలేదని అంటున్నారు.
-కుసునూరి వెంకటమ్మ, మహిళా రైతు, ఖమ్మం రూరల్