మధిర, సెప్టెంబర్ 22: చింతకాని మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో గల జగన్నాథపురం, కొదుమూరు గ్రామాల్లో సోమవారం యూరి యా కోసం రైతులు బారులుదీరారు. యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున రైతువేదికల వద్దకు చేరుకున్నారు. కొదుమూరులో ఏడీఏ, ఏవో సమక్షంలో కూపన్లు జారీ చేసి యూరి యా పంపిణీ చేశారు. అదేవిధంగా ఖమ్మం- బోనకల్లు ప్రధాన రహదారి పక్కనే ఉన్న జగన్నాథపురం రైతువేదిక వద్ద పెద్దఎత్తున యూరియా కోసం రైతులు బారులుదీరారు. ముందుగానే తయారు చేసుకున్న లిస్టు ప్రకారం అధికారులు యూరియా పంపిణీ చేస్తుండడంతో లైన్లో ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే యూరియా ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేవారు. యూరియా అందని రైతులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న మధిర ఏడీఏ విజయచంద్ర, వైరా సీఐ సాగర్, ఎస్సై వీరేందర్, ఏవో మానస రైతువేదిక వద్దకు చేరుకున్నారు. క్రమపద్ధతిలో యూరియా అందించడం జరుగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. సుమారు 200మంది రైతులు తరలిరాగా కేవలం 125 యూరియా కట్టలు మాత్రమే సరఫరా చేశారు.
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 22 : రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అన్నదాతలను అధోగతిపాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పత్తికి క్వింటాకు రూ.10,075 మద్దతు ధర చెల్లించాలని, యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర నాయకులు కమ్మకొమటి నాగేశ్వరరావు, రేపాకుల శివలింగం, తిమ్మిడి హనుమంతరావు, సోమనపల్లి వెంకటేశ్వర్లు, గోకినపల్లి సరోజిని పాల్గొన్నారు.
వైరాటౌన్, సెప్టెంబర్ 22 : వరి పం టకు ప్రస్తుతం యూరియా అత్యవసరమని, వైరా మండలానికి వెంటనే యుద్ధప్రాతిపదికన 500 మెట్రిక్ టన్నుల యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం వైరా మండలం గొల్లెనపాడు గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఖాళీ యూ రియా సంచులు చేతబట్టి నిరసన తెలిపారు. వైరా మండలంలో వరిసాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకొని యూరియా సరఫరా పెంచాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలోనే అధిక విస్తీర్ణంలో వరి సాగు చేసిన వైరా మండలానికి అన్యాయం జరుగుతున్నదని, 20వేల ఎకరాలకు సరిపడా యూరియా కేటాయింపులు జరగాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు అమరనేని వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి ఆళ్ళ శ్రీనివాస్, ఆళ్ళ వెంకట్రావు, రాజేంద్రప్రసాద్, శ్రీరామనేని ప్రసాద్, వెంపటి సత్యం, నల్లమోతు రాజాబాబు, ఆళ్ళ జ్యోతి, చండ్ర ఉమ, రేణుక, గంగయ్య, బాలకృష్ణ పాల్గొన్నారు.
అన్నదాతలు యూరియా కోసం ఈ వానకాలం సీజన్సాంతం అరిగోస పడుతూనే ఉన్నారు. సొసైటీ కేంద్రాలు, ఎరువుల గోడౌన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. అయినా సమయానికి యూరియా అందడం లేదు. దీంతో పంటలు ఆగమయ్యే పరిస్థితి దాపురించడంతో ఆవేదన చెందుతున్నాడు. దిగుబడి తగ్గి నష్టాలపాలు కాకతప్పదని లోలోపల కుమిలిపోతున్నాడు. రోడ్డెక్కి తమ ఆవేదనను తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కనికరించడం లేదు. సరిపడా యూరియాను ఇప్పటివరకు రైతులకు అందించలేకపోతున్నది. పైగా యూరియా కోసం క్యూలైన్లో ఉన్నవారికి ముందుగా కూపన్లు అందజేయడం.. తర్వాత ఎప్పటికో స్టాక్ వచ్చాక యూరియా అందజేస్తుండడంతో సీజన్ మొత్తం రైతులకు అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతున్నది.