నమస్తే తెలంగాణ, ముదిగొండ, మే 13: మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు మెరుపు ధర్నాకు దిగిన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా ఆన్లైన్ సేవలు పని చేయకపోవడంతో పంటల వద్దే పడికాపులు కాస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామునే వస్తే ఈరోజు కూడా పనిచేయట్లేదు అని చెప్పడంతో కోపోద్రిక్తులైన రైతులు ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆరుగాలం నానా పాట్లు పడి పంట పండిస్తే పంటను అమ్ముకోవడానికి అంతకుమించి తిప్పలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.
రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్న క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉందని అన్నారు. కల్లాల్లో ధాన్యం పోసి ఎప్పుడు కొంటారని ఎదురు చూస్తున్నామని చీకటి పడితే చాలు వర్షం వస్తుందేమోనని గుండెలపై చేయి వేసుకొని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.