అశ్వారావుపేట, ఏప్రిల్ 8: ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తరణ భారీగా పెరగటం వల్ల క్రూడాయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అశ్వారావుపేట లేదా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రిఫైనరీ(నూనె శుద్ధి) యూనిట్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆయిల్‌పాం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు ఉమామహేశ్వర్‌రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
దీంతోపాటు 2016-2020 మధ్య ఆఫ్ టైప్ ఆయిల్‌పాం మొక్కలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, ఐఐఓపీఆర్ ద్వారా ఆయిల్‌పాం పరిశోధనా కేంద్రం, ప్రత్యేక ఆయిల్‌పాం బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్‌పాం రైతు సమస్యలపై మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ డివిజన్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్‌పాం సాగు రైతులతో ఆయిల్‌ఫెడ్ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని, ప్రతి ఏటా మహాజన సభలు నిర్వహించి ఆయిల్‌ఫెడ్ సంస్థ ఆదాయ, వ్యయాలను రైతులకు పారదర్శకంగా వివరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్(డీవో) రాధాకృష్ణకు అందజేశారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు తీసుకుంటానని డీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అన్నవరపు సత్యనారాయణ, వెలమంచిలి వంశీ కృష్ణ, తలసిల ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.