మధిర, నవంబర్ 10 : రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కోసం ప్యాడి క్లీనర్, పట్టాలు, కాంటాలు, మ్యాయచర్ మిషన్లను సహకార సీఈఓ లకు, ఐకెపి నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధుర మార్కెట్ కమిటీ పరిధిలోని మూడు మండలాల్లో 40 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాలకు రైతులు తాము పండించిన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. దీనికి అనుగుణంగా రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ ప్రథమశ్రేణి కార్యదర్శి చంద్రశేఖర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.