మధిర, ఏప్రిల్ 24 : పంటల పండించే భూములను రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని మధిర ఏడీఏ స్వర్ణ విజయ్చంద్ర కోరారు. గురువారం మధిర మండలంలోని మాటూరు క్లస్టర్లో గల రైతు వేదికలో వ్యవసాయ శాఖ డిజిటల్ గ్రీన్ అనే ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడిఏ విజయ చంద్ర మాట్లాడుతూ.. మన ఆరోగ్యానికి హెల్త్ చెకప్ ఎలానో మన భూమికి భూసార పరీక్ష అలాంటిదే అన్నారు. ప్రతి మూడు సీజన్లకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ భూసార పరీక్ష వల్ల భూమిలో ఉండే పోషకాల విలువ తెలుసుకోవచ్చని, తద్వారా ఏ పంటలు వేసుకోవచ్చో తెలుస్తదన్నారు.
రైతులందరూ మూస పద్దతిలో పంటలు సాగు చేస్తే ఉపయోగం ఉండదని, అంతర పంటలు వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. అలాగే ఆయిల్ పామ్ పంట వల్ల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. డిజిటల్ గ్రీన్ కోఆర్డినేటర్ యశోద మాట్లాడుతూ.. భూసార పరీక్షలు కాకుండా ఫార్మ్ చాట్ అనే యాప్ ద్వారా రైతులకి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలువురి రైతులకి చెందిన భూములకు భూసార పరీక్షలు నిర్వహించి వెంటనే సాయిల్ హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఏఓ సాయి దీక్షిత్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కిశోర్, ఏఈఓ నిఖిత, రైతులు, డిజిటల్ గ్రీన్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.