మామిళ్లగూడెం, మే 23 : రానున్న వానకాలం పంటల సాగు సీజన్లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని, బిల్లులు తీసుకొని భద్రపర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్కువ ధరలకు విత్తనాలు అందిస్తామని, అధిక దిగుబడి వస్తుందని కొందరు అక్రమార్కులు ప్రచారం చేస్తూ రైతులను మోసం చేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.
అలాంటి మోసపూరిత ప్రచారాలను రైతులు నమ్మవద్దన్నారు. గుర్తింపు లేని వ్యాపారుల వద్ద నుంచి ఎట్టి పరిస్థితిల్లోనూ విత్తనాలు కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ సూచించిన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై సమాచారం తెలిసినా, అనుమానాస్పద విక్రయాల గురించి తెలిసినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1077కు సమాచారం అందించాలని కోరారు. నకిలీ విత్తనాల, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసకుంటామని స్పష్టం చేశారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి నాణ్యమైన విత్తనాలు మాత్రమే వినియోగించాలని తెలిపారు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి
జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఎండలో బయట తిరగవద్దని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రావొద్దని, చిన్నారులు, వృద్ధులు వారి ఇళ్లలోనే ఉండాలని సూచించారు. సరిపడా తాగునీరు తీసుకోవాలని, వదులుగా ఉన్న దుస్తులు ధరించాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలుంటే స్థానిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు.
పంటల అవశేషాలను కాల్చొద్దు..
పంటల అవశేషాలను కాల్చొద్దని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. రైతులు తమ పొలాల్లోని పంటల అవశేషాలన కాల్పడం వల్ల మంటలు అదుపు తప్పి పక్కనున్న పంటలు, ఆస్తులు, విద్యుత్ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. పశువులకూ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పర్యావరణానికి, భూసారానికి, రైతుల ఆర్థిక పరిస్థితికి తీవ్ర నష్టం కలుగుతుందని వివరించారు. రైతులు తమ పంటల అవశేషాలను కాల్చుతున్నట్లుగా అధికారులు గమనిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.