ఖమ్మం, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు’ అనే పాటను తలపిస్తున్నది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ తీరు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా కొనసాగుతున్నది ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో పంటల రుణమాఫీ పరిస్థితి. యావత్ జిల్లాలోనే అతిపెద్ద మండలంగా ఖమ్మం రూరల్ ఉంది. ఇక్కడ దాదాపు 15 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. కానీ.. మండలంలో ఒకే ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉంది. దశాబ్దాలుగా ఈ సొసైటీలోనే చాలా మంది రైతులు పంట రుణాలు తీసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు.
ఈ సొసైటీతోపాటు గ్రామీణ వికాస బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉన్నప్పటికీ ప్రభుత్వరంగ సంస్థ కావడంతో అనేక మంది సన్న, చిన్నకారు రైతులు ఈ సొసైటీలోనే పంట రుణాలు అధికంగా తీసుకోవడం ఆనవాయితీ. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే 2018 నుంచి 2023 వరకు రూ.2 లక్షల పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు ఏదులాపురం సొసైటీ వారు అందజేశారు. 3,691 మంది రైతులు అర్హత కలిగి ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.
తొలి విడత నుంచి మొదలైన కోతల రుణమాఫీ చివరి వరకు సైతం అదే జోరు కొనసాగింది. అర్హత ఉన్నా మాకు ఎందుకు రాలేదు రుణమాఫీ అని అడుగుతున్న రైతులకు ఏమని సమాధానం చెప్పాలో తెలియని అధికారులు సాగతీత, దాటవేతకు మాత్రమే యత్నించడం విశేషం. గతంలో కేసీఆర్ హయాంలో వచ్చిన రుణమాఫీ తప్ప ఈ మూడు విడతల్లో ఎక్కడ కూడా తమకు మాఫీ రాలేదని ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాట్లను సరిదిద్దాల్సిన అధికారులు సైతం తప్పించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్హత ఉన్నా పంటల రుణమాఫీకి నోచుకోని ఒక్కో రైతు పరిస్థితి ఒక్కో విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత రైతుల పరిస్థితి రాస్తే రామాయణం.. చెబితే భాగవతం అన్నట్లుగా ఉంది. భర్తలు లేని భార్యల పరిస్థితి ఒక విధంగా ఉంటే. ఈ సీజన్లో పంట పొలాల వద్ద ఉండాల్సిన రైతులు పక్షం రోజుల నుంచి బ్యాంకులు, సొసైటీ వద్ద పడిగాపులు పడుతున్నారు.
ఏదులాపురం సొసైటీ పరిధిలోని దాదాపుగా 28 గ్రామాల రైతుల పరిస్థితి ఇలానే ఉంది. 3 వేల మంది రైతులు కాకుండా రూ.2 లక్షల పైబడి పంట రుణాలు తీసుకున్న రైతుల బాధలు మరింత బాధను కలిగిస్తున్నాయి. స్వయంగా సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు సైతం రూ.2లక్షల పైబడిన వారికి సైతం మాఫీ చేస్తామని అనేక సార్లు చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి మా పరిస్థితి గురించి ఎవరూ మాట్లాడడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
రేషన్ కార్డు లేనంత మాత్రాన రుణమాఫీ జాబితాలో పేరు లేదని కొందరు బాధ పడుతుంటే, రెండు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు కాబట్టి మీకు మాఫీ రాదు అని అధికారులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. కుటుంబాలు వేరుపడి పట్టాదారు పాసు పుస్తకాలు వేర్వేరుగా ఉండి సాగు చేసుకుంటున్న రేషన్ కార్డు ఒక్కటే కాబట్టి ఆ పేరుతో రుణమాఫీ ఎగ్గొడుతున్నారని రైతులు వాదిస్తున్నారు. ఇలా ఒక్కో రైతు బాధ కార్యాలయం దగ్గర ఒక్కో రకంగా కనబడుతున్నది. నాటి సీఎం కేసీఆర్ రూ.లక్ష మాఫీ చేసినా ఇన్ని కండీషన్లు పెట్టలేదని వారు గుర్తు చేసుకోవడం విశేషం.
రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ అయిన నాటి నుంచి ఇటు సొసైటీ, అటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాను. ఈ సారి రాలేదు. రెండో జాబితాలో పేరు వస్తుంది అన్నారు. రెండో జాబితాలో కూడా రాకపోవడంతో మూడో జాబితాలో వస్తుంది అన్నారు. ఇప్పుడు మూడో జాబితా కూడా వచ్చింది. కానీ.. నా పేరు రాలేదు. సొసైటీలో రూ.50 వేలు రుణం తీసుకున్నాను. సెంట్రల్ బ్యాంకులో రూ.1.60 లక్షలు తీసుకున్నాను. అక్కడా మాఫీ కాలేదు. ఇక్కడా మాఫీ కాలేదు. పోనీ రూ.2 లక్షల పైబడి ఉన్న సొమ్ము కడతాను అని చెప్పాను. కానీ.. వారు ఏ సమాధానం చెప్పడం లేదు. పొలం పనులు చేయలేక. ఇటు బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నాను.
-బానోతు వస్రాం, రైతు, కస్నాతండా
నా పేరు బొమ్మెర్ల వరప్రసాద్. మాది టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామం. నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. డీసీసీబీలో రూ.1.30 లక్షలు, ఏపీజీవీబీలో రూ.80 వేలు పంట రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం షరతులు, కొర్రీలు పెట్టకుండా రైతుల రుణమాఫీ చేయాల్సిందే. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఇప్పుడు కట్టాలంటే రైతు భరోసా రాక సతమతమవుతున్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.
నా పేరు ధరావత్ బాలాజీ. మాది టేకులపల్లి మండలం శాంతినగర్. రెండేళ్లుగా మిర్చి తోటలు సరిగా పండకపోవడంతో బ్యాంకులో తీసుకున్న రుణం రూ.2 లక్షల కంటే ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే.. మళ్లీ కొత్త రుణం వస్తుందని ఆశపడ్డా. నాకు మాత్రం రుణమాఫీ కాకపోవడం ఆందోళనగా ఉంది. రైతుల పరిస్థితి గురించి ప్రభుత్వం ఆలోచించి రూ.2 లక్షల కంటే ఎక్కువ, తక్కువలతో సంబంధం లేకుండా మాఫీ చేసి ఆదుకోవాలి.
రూ.2 లక్షలపైన రుణాలు తీసుకున్న రైతులకు కూడా తక్షణమే రుణమాఫీ వర్తింపచేయాలి. రుణమాఫీ ప్రక్రియ మూడు విడతలు పూర్తయినందున రూ.2 లక్షలకు పైబడి రుణాలున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణ విముక్తులు కావాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతాంగాన్ని బాధ పెట్టడం సరికాదు. రూ.2 లక్షలు పైన అప్పు ఉన్నవారికి కూడా వారి ఖాతాల్లో ముందుగానే రూ.2 లక్షలు జమ చేసిన తర్వాత మిగిలిన అప్పును రైతులు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
– కొమ్మినేని సుధాకర్, సీపీఐ మండల కార్యదర్శి, పెనుబల్లి