కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ..’ అనే సామెత మాదిరిగా రేవంత్ సర్కారు వ్యవహార శైలి ఉంది. ఆర్భాటాలు, అబద్ధపు ప్రకటనలు తప్ప.. క్షేత్రస్థాయిలో ఆచరణ ఇసుమంతైనా కన్పించడం లేదు. పైలెట్ గ్రామాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుభరోసాను జమ చేశామంటూ ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని పైలెట్ గ్రామాల్లోనూ క్షేత్ర పరిశీలన చేపట్టింది.
దీంతో అసలు విషయం వెల్లడైంది. ప్రభుత్వం చెబుతున్నవి కేవలం అబద్ధాలేనని, ఇంకా 40 శాతం మందికి రైతుభరోసా అందాల్సి ఉందని తేటతెల్లమైంది. భద్రాద్రి జిల్లాలోని పైలెట్ గ్రామాల్లో మొత్తం 22 వేల మంది రైతులకు రైతుభరోసా కింద పంటల పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా 19 వేల మందికి సాయం జమ అయింది. ఇంకా మూడు వేల మందికి అందాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా 20,802 మంది రైతులకు మొత్తం రూ.28.42 కోట్లు జమ కావాల్సి ఉంది.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మార్చి 10
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే తప్ప చేతలకు సరిపోదని మరోమారు నిరూపితమైంది. పైలెట్ గ్రామాల్లోని రైతులకు జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు తాజా సీజన్ కోసం ఒక్కో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. అప్పటి సభలో సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులందరూ 26న, ఆ మరుసటి రోజున తమ సెల్ఫోన్లు చేతపట్టుకొని కూర్చున్నారు. ఎంతసేపు వేచి చూసినా చాలా రోజుల వరకూ రైతుభరోసా నగదు తమ ఖాతాల్లో జమ కాలేదు.
తరువాతి రోజుల్లో ఎకరం లోపు నుంచి మొదలుపెట్టి విడతల వారీగా జమ చేస్తూ వచ్చింది. అయితే సుమారు మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ 40 శాతం మందికి మాత్రమే ఈ పంటల పెట్టుబడి సాయం జమ కావడం గమనార్హం. పైలెట్ గ్రామాలేగాక మిగిలిన గ్రామాల్లోనూ ఇంతకంటే దయనీయమైన పరిస్థితే నెలకొంది. ఆ గ్రామాల్లో కూడా కేవలం మూడు ఎకరాలలోపు విస్తీర్ణం కలిగిన రైతులకే రైతుభరోసాను జమచేసింది. అదీ కూడా సగం మందికే కావడం విశేషం. దీంతో అన్నదాతలందరూ కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుభరోసా నగదు తమకు ఇంకెప్పుడు జమ అవుతాయో తెలుసుకునేందుకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో 21 గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేశారు. వీటిల్లో రైతుభరోసా కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున 20,802 మంది రైతులకు గాను 47,374.28 ఎకరాలకు రూ.28.42 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కొన్ని పైలెట్ గ్రామాలను పరిశీలిస్తే ఇంకా చాలామంది రైతులకు పంటల పెట్టుబడి సాయం అందలేదనే విషయం స్పష్టమవుతోంది. ఖమ్మం రూరల్ మండలం పైలెట్ గ్రామమైన ఆరెంపులలో 614 మంది రైతులకుగాను ఇంకా 14 మంది రైతులకు రైతుభరోసా జమ కాలేదు. వైరా మండలం పుణ్యపురంలో ఇంకా 19 మంది రైతులకు రైతుభరోసా జమ కావాల్సి ఉంది. బోనకల్లు మండలం గార్లపాడులో 589 మంది రైతులకుగాను ఇంకా 30 మంది రైతులకు రైతుభరోసా అందలేదు. ఇక కూసుమంచి రెవెన్యూ పరిధిలో మొత్తం 3,187 మంది రైతులకు గాను ఇంకా 168 మంది రైతులకు జమ కాలేదు.
పైలెట్ గ్రామాల్లోని రైతులకు అందాల్సిన రైతుభరోసా విషయంలో భద్రాద్రి జిల్లాలోనూ అదేతీరు కన్పిస్తోంది. ఈ జిల్లాలో 23 పైలెట్ గ్రామాల్లో 22 వేల మంది రైతులకు రైతుభరోసా జమ చేయాల్సి ఉంది. కానీ ఇంకా మూడు వేల మంది రైతులకుపైగా రైతుభరోసా జమ కాలేదు. అదే విధంగా పైలెట్ గ్రామాలను మినహాయించి పరిశీలించినా అదే విషయం స్పష్టమవుతోంది. ఇప్పటి వరకూ 3 ఎకరాల్లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు కూడా పూర్తిస్థాయి పంటల సాయం అందలేదు. 3 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు అసలే అందలేదు. వీరిలో ఈ జిల్లాలో మొత్తం 1,87,000 మంది రైతులు ఉన్నారు. ఇందులో 1,07,094 మంది రైతులకు రైతుభరోసా జమ చేశారు. ఇంకా 79,906 మందికి జమ చేయాల్సి ఉంది.
అయితే, పైలెట్ గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి నాలుగు పథకాల్లో భాగంగా రైతుభరోసా కూడా అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఆయా గ్రామాల్లో పోడు పట్టాలున్న రైతులకు మాత్రం భరోసా అందలేదు. కేవలం రెవెన్యూ పట్టాలు ఉన్న భూములకు మాత్రమే రైతుభరోసా జమ చేశారు. వీటిల్లో పైలెట్ గ్రామాల వారీగా పరిశీలిస్తే.. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల, మైలారం గ్రామాల్లో 801 మంది రైతులుండగా వారిలో 484 మంది రైతులకు భరోసా ఇచ్చారు. ఇంకా 314 మందికి అందలేదు.
టేకులపల్లి మండలం బేతంపూడిలో 7,863 మంది రైతులకుగాను 5,637 మంది రైతులకే పంటల పెట్టుబడి అందింది. ఇంకా 2,026 మందికి అందాలి. ఇల్లెందులో 1,550 మంది రైతుల్లో 44 మంది రైతులకు భరోసా అందలేదు. సుజాతనగర్ మండలంలో 2,430 మంది రైతులకుగాను ఇంకా 345 మంది రైతులకు సర్కారు మొండిచేయి చూపింది. అశ్వారావుపేట మండలం పాతరెడ్డిగూడెంలో 1,753 మంది రైతులకు గాను ఇంకా 136 మందికి అందలేదు. ఇక గుండాల, ఆళ్లపల్లి, పినపాక, చర్ల మండలాల్లో పోడు రైతులకు రైతుభరోసా జమ కాలేదు. దీంతో ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాది పాలేరు. నాకు ఎర్రగడ్డతండాలో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. నాకు గడిచిన మూడు దఫాలుగా రైతు భరోసా డబ్బులు రాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి సీజన్లోనూ రైతుబంధు కింద పంటల పెట్టుబడి సాయం అందేది. కాంగ్రెస్ వచ్చాక గడిచిన వానకాలం, యాసంగి, ప్రస్తుత వానకాలం సీజన్ల డబ్బులు పడలేదు. మా దగ్గర కొంత మందికి డబ్బులు పడ్డాయి. కాంగ్రెస్ రాగానే ఎకరాకు రూ.15 వేలు వేస్తామన్నారు. కానీ, ఎకరానికి రూ.12 వేలు మాత్రమే ప్రకటించారు.
-బానోతు వెంకట్రామ్, రైతు, పాలేరు
రైతుభరోసాను రూ.12 వేలకు పెంచామని, మొన్న రూ.6 వేల చొప్పున బ్యాంకులో వేశామని ప్రభుత్వం ప్రకటనలు చేసింది. కానీ మాకు మాత్రం ఇప్పటికీ రైతుభరోసా జమ కాలేదు. అసలు మాకు ఎంత పెరిగిందో కూడా నాకు తెలియదు. 20 కిలోమీటర్లు ప్రయాణిం చి బ్యాంకుకు వెళ్లి అడిగితే పంటల పెట్టుబడి జమ కాలేదని చెప్పారు. అందరికీ రైతుభరోసా నగదు జమ అవుతుందని గ్రామసభ రోజు చెప్పారు. మాకింకా పడలేదు.
-కేలోత్ లక్ష్మణ్, మైలారం, లక్ష్మీదేవిపల్లి
నాకున్న 2 ఎకరాల 10 గుంటలకు రైతు భరోసా ఇంకా పడలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినా ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. అధికారులు, కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉంది. పంటల సాగు కోసం పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నాం. తిరిగి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరికి పెట్టుబడి కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు భరోసా అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
-కొమరం నాగేశ్వరరావు, రేగళ్ల, కరకగూడెం మండలం
మాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పత్తి పంట సాగు చేస్తున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రైతుబంధు అందింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంకా రైతుభరోసా అందలేదు. అధికారులను అడిగితే వస్తుందంటూ సమాధానం చెబుతున్నారు. కానీ ఇంకా అందడం లేదు. పంటల పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
-యాట్ల లక్ష్మి, మహిళా రైతు, పాతరెడ్డిగూడెం, అశ్వారావుపేట