పెనుబల్లి, మే 5 : నెల రోజులుగా కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకొని ఎదురుచూస్తున్నా నిర్వాహకులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో విసుగు చెందిన రైతులు కల్లూరు మండలం పుల్లయ్యబంజర గ్రామంలో సోమవారం కల్లూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిల్లులు ఖాళీ లేవని, ధాన్యంలో తేమ శాతం రావాలని, కొన్నిరోజులు లారీలు లేవని సాకులు చెబుతూ ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదన్నారు. తూకాల్లో తరుగు తీస్తూ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పంట వేసింది మొదలు చేతికొచ్చే వరకు నానా కష్టాలుపడ్డ తాము తీరా అమ్ముకునేందుకు తీసుకొస్తే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని రైతులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, అప్పటి వరకు కదిలేది లేదంటూ భీష్మించారు. అయితే రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై హరిత అక్కడికి చేరుకుని.. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం రైతులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు.