బోనకల్లు, ఫిబ్రవరి 24 : వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సాగర్ నీటిని బీబీసీ(బోనకల్ బ్రాంచ్ కెనాల్) నుంచి నారాయణపురం మైనర్ ద్వారా సరఫరా చేస్తుండగా.. ఆ నీటి ఆధారంగా సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు సంఘం నాయకుడు చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడుతూ వారబందీ విధానం వల్ల చివరి ఆయకట్టులో సాగు చేసిన మొక్కజొన్న పంటలకు నీరందడం లేదన్నారు. ఎన్నెస్పీ అధికారులు వారబందీ విధానం ఎత్తివేసి, చివరి భూముల వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న జేఈ రాజేశ్ అక్కడికి చేరుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, కిలారు సురేశ్, కూచిపూడి మురళి, కోట నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు గుగులోతు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.