భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా ఉపయోగం లేదని, వారు దోచుకోవడం తప్ప జిల్లాకు ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రతిరోజు రైతుల బాధలు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడూ రైతులు ఇబ్బందులు పడలేదని, కేసీఆర్ హయాంలో ప్రతి గింజనూ కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెత్త పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. త్వరలో పార్టీ ప్రతి సభ్యత్వాన్ని డిజిటల్‌గా చేస్తున్నామని, అందుకే జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
వర్గాలకు తావులేకుండా పనిచేయాలని, అంతా కేసీఆర్ వర్గమేనని, గ్రూపులు లేకుండా పనిచేస్తే గెలుపు మనదేనన్నారు. త్వరలో అన్ని కమిటీలను వేస్తున్నామని, సభ్యత్వాలు అయ్యాక కమిటీలు ఉంటాయన్నారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, రాఘవేంద్రరావు, సింధుతపస్వి, మధుచంద్, రాంబాబు, గుణచరిత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.