వ్యక్తంచేస్తున్న అన్నదాతలుఖమ్మం, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాల్గో విడత రుణమాఫీ జాబితాలో తమ పేరు ఎందుకు రాలేదో చెప్పాలని జిల్లావ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీల బాధ్యులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం మండల, జిల్లాస్థాయిలో గ్రీవెన్స్ ఉండడం వల్ల అధికారులు అందుబాటులో లేరు. దీంతో కొందరు రైతులు ఫోన్ల ద్వారా వాకబు చేయగా, మరికొందరు రైతులు గ్రామ వ్యవసాయ శాఖ విస్తరణ అధికారుల చుట్టూ తిరిగారు.
సొసైటీలో సైతం సీఈవోలు, చైర్మన్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన పేరుతో అందుబాటులో లేకుండాపోయారు. నాల్గో విడతలోనైనా తమ పేరు వచ్చిందేమో చూడాలని రైతులు ఆయా కార్యాలయాల్లో ఉన్న సిబ్బందిని అడగగా.. పూర్తిస్థాయి జాబితా సోమవారం సాయంత్రం వరకు వస్తుంది, వాట్సప్‌లో వచ్చిన జాబితా ఆధారంగా చెప్పలేమని వారికి బదులిచ్చారు. ఒకవైపు వానకాలం సీజన్ ముగిసింది. యాసంగి సీజన్లోనైనా పంట రుణాలు తీసుకుందాంలే.. అనుకున్న రైతుల
కు నాల్గో విడత రుణమాఫీ జాబితా నిరాశపరిచింది. ఇప్పటికే రూ.2 లక్షల పైబడి అప్పు ఉన్న వందలాది మంది రైతులు పైబడిన సొమ్మును బ్యాంకులకు చెల్లించారు. రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులకు సైతం పలు సాంకేతిక కారణాలతో మాఫీ జరగలేదు. అయితే రేషన్‌కార్డు ఎడిట్, ఆధార్, బ్యాంకు అకౌంట్లో పొరపొచ్చాలు పూర్తిచేసిన వారి పేరు సైతం నాల్గో విడుత జాబితాలో లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మాఫీ చేస్తాం అంటే చేయాలి, చేతకాకపోతే చెప్పాలి. మేమైనా అప్పుడప్పుడు ఎంతో కొంత కట్టుకునే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో జాబితా ఉంటుందా, ఇంతటితో రుణమాఫీ ప్రక్రియ ముగిసినట్టేనా అనేది స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు.
రూ.2 లక్షలకు పైబడి పంట రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుందో.. లేదో.. నెలలు గడిచినా ఇంతవరకు స్పష్టత రాలేదు. సొసైటీలో ఒక విధంగా, బ్యాంకుల్లో మరోవిధంగా, అధికారులు ఇంకోవిధంగా చెబుతుండడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే కొందరు బ్యాంకు అధికారులు రూ.2 లక్షల పైబడి అప్పు ఉన్నవారి నుంచి పై డబ్బులు కట్టించుకున్నారు. ఇలా కడితేనే రుణమాఫీ జరుగుతుందని చెప్పడంతో అప్పటికప్పుడు రైతులు మిగిలిన సొమ్మును అప్పు చేసి మరీ చెల్లించారు. అయితే గత కొద్దిరోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు.
ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే పైడబ్బులు చెల్లించాలని చెప్పడంతో తిరిగి ఆ మరుసటిరోజు నుంచి అధికారులు యూటర్న్ తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 16 రకాల బ్యాంకుల్లో కలిపి 3,71,157 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరికి సుమారుగా రూ.4,307 కోట్ల రుణమాఫీ వర్తించే అవకాశం ఉంది. అయితే నేటివరకు నాలుగు విడతలు కలిపి 1,33,197 మంది రైతులకు గాను రూ.926 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. గతంలో ప్రభుత్వం రూ.2 లక్షల పైబడి రుణాలు తీసుకున్న రైతులు పై నిధులను చెల్లిస్తే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
రుణమాఫీపై అధికారులు, బ్యాంకర్లు రోజుకో రకంగా మాట మారుస్తుండడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన మూడు నెలల నుంచి అదిగో రుణమాఫీ.. ఇదిగో రుణమాఫీ అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమతోపాటు పంట రుణాలు తీసుకున్న కొందరికి రుణమాఫీ చేసి మాకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు రేషన్‌కార్డు, ఆధార్ తప్పులు, నెంబర్ తేడా అంటూ సాకులు చెప్పిన ప్రభుత్వం వాటిని సరిచేశాక కూడా ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. నాల్గో విడతలోనూ రూ.లక్షలోపు, రూ.1.50 లక్షలలోపు ఉన్న రైతుల పేర్లు సైతం లేకపోవడంతో సదరు రైతులు సోమవారం వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్లర్లు, సొసైటీ బాధ్యుల చుట్టూ తిరిగిన దృశ్యాలు జిల్లావ్యాప్తంగా కనిపించాయి.
నేను వ్యవసాయం కోసం బ్యాంకు నుంచి రూ.85 వేలు అప్పు తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎంతో ఆశ పెట్టుకున్నా. రేషన్ కార్డు కోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా.. కార్డు రాలేదు. మా లాంటి గిరిజనులకు చాలా మందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవు. దీని వల్ల నా అప్పు మాఫీ కాలేదంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు. ముందు నిబంధనలు చెప్పకుండా రూ.2 లక్షలు రుణమాఫీ అని చెప్పారు. ఇప్పుడు కొర్రీలు పెడుతూ రుణమాఫీ చేయడం లేదు.
-సోరెం సూరప్ప, రైతు, అశ్వారావుపేట
నాకు మొండికుంట యూనియన్ బ్యాంకులో రూ.2.80 లక్షల అప్పు ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నా పేరు లేకపోవడంతో మాఫీ కాలేదు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే.. రూ.2 లక్షలలోపు రుణాలను మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసిందని చెప్పారు. రూ.2 లక్షలు పైబడిన వారి రుణాలు ఎప్పుడు చేస్తారో తెలియదంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. అందరు రైతులతోపాటు నేను తీసుకున్న రుణం కూడా మాఫీ చేయాలి.
-కొడిమె వీరాస్వామి, రైతు, కుర్వపల్లి కొత్తూరు, అశ్వాపురం మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల పంటల సాగుకు రైతుబంధు సాయం అందకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం పంటల సాగుకు ముందుగానే ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం అందించి ఆదుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల సాగు పూర్తయినా సాయం అందించకుండా రైతులను మోసం చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
-శీలం లచ్చిరెడ్డి, రైతు, కర్రాలపాడు, పెనుబల్లి మండలం
వానకాలం పంట పెట్టుబడి సాయం రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించకుండా మోసం చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వకుండా రైతులను మోసం చేయడంతోపాటు రైతుబంధు కూడా సర్కార్ అందించలేదు. ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చింది. మాయమాటలు చెప్పడం తప్ప రైతులకు చేసిందేమీ లేదు.
-కాకా ప్రసాద్, రైతు, తాళ్లపెంట, పెనుబల్లి మండలం
రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణం మొత్తం చెల్లించినా నాకు మాఫీ కాలేదు. ఆ జాబితాలో నా పేరు కూడా లేదు. ప్రభుత్వం తీరు రైతులను ఇబ్బందికి గురిచేసేలా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ కోసం ఏ అధికారి వద్దకు తిరగకుండానే మాఫీ చేశారు. ఇప్పుడు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా మాఫీ కావడం లేదు. ఒక వైపు రైతుబంధు లేదు.. మరోవైపు రుణమాఫీ కాకపోవడంతో రైతులను మరింత ఆందోళనకు గురిచేసే విధంగా ప్రభుత్వ పాలన ఉంది.
-సోడె భిక్షమయ్య, రైతు, కుర్వపల్లి కొత్తూరు, అశ్వాపురం మండలం