ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 8 : ఈ సంవత్సరం పత్తి సాగు చేసిన రైతుల కష్టాలు రాస్తే రామాయణం.. చెబితే భాగవతం అన్నట్లు ఉంది. వానకాలం సీజన్ ఆరంభమైంది మొదలు పంట చేతికొచ్చే వరకూ జిల్లా రైతులు అడుగడుగునా అరిగోస పడుతున్నారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిపోయి మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. పంటల పెట్టుబడి(రైతుబంధు) రాక, రుణమాఫీ పూర్తిగా జరగకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి మరీ పంటను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. వీటన్నింటినీ తట్టుకొని నిలబడిన రైతులకు తీరా మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో వారి పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు ఉంది.
ప్రధాన పంట అయిన పత్తి తీరా చేతికొచ్చేసరికి ఆశించిన ధర రాకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రైతులు పోయే పరిస్థితి లేదు. సీసీఐ అధికారులు పెడుతున్న అనేక కొర్రీల కారణంగా ప్రైవేట్ వ్యాపారులకే పంటను తెగనమ్ముకుంటున్నారు. ప్రైవేట్‌తో పోల్చుకుంటే కనీసం పావుశాతం సైతం సీసీఐ అధికారులు పంట కొనలేదు. తేమశాతం పేరుతో కొర్రీలు పెడుతున్న తరుణంలో సదరు రైతులు అదే సీసీఐ కేంద్రంలో అదే జిన్నింగ్ మిల్లు యజమానికి అడ్డికి పావుశేరు చొప్పున పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి పత్తి రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని క్వింటా ఒక్కంటికి రూ.1000 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవేట్ వ్యాపారులు పంటలను ఇష్టారీతిన కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రతియేటా ఏర్పాటు చేస్తున్నది. కానీ.. ప్రభుత్వ ఉద్దేశం నెరవేరకపోగా పరిస్థితి భిన్నంగా ఉంటోంది. మద్దతు ధర కోసం పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్తున్న రైతులు అక్కడే అదే జిన్నింగ్ మిల్లు యజమానికి అడ్డికి పావుశేరుకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సంవత్సరం అధికారులు ఖమ్మం జిల్లావ్యాప్తంగా 9 జిన్నింగ్ మిల్లులను సీసీఐ కొనుగోళ్లకు నోటీఫై చేశారు.
అయితే వాటిలో ఆరు కేంద్రాల్లో క్రయవిక్రయాలు జరుగుతున్నప్పటికీ మూడు కేంద్రాల్లో మాత్రమే మూడంకెల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు జరిగింది. ఎన్నో ఆశలతో పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. రైతులు తీసుకొచ్చిన పంటకు సంబంధించిన వాహనంలో అడుగడుగునా తేమశాతం నిర్ధారణ యంత్రాలను ఉపయోగించి రిజక్టు చేస్తున్నారు. దీంతో పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక సూపర్ క్వాలిటీ ఉన్న పంటను సైతం అదే కేంద్రంలో అదే జిన్నింగ్ మిల్లు యజమానికి క్వింటాకు రూ.6 వేల నుంచి రూ.6,300 వరకు అమ్ముకుంటున్నారు. కావాలని రైతులను ఇబ్బంది పెట్టి మరీ ఎట్టకేలకు మిల్లు ఓనర్లకు పంటను అమ్ముకునే విధంగా సీసీఐ అధికారులు ప్రవర్తిస్తున్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ఖరీదుదారులు గత రెండు మూడ్రోజుల నుంచి పేచీల పేరుతో పత్తి రైతులను చిత్తు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాల తంతును పసిగట్టిన మార్కెట్ ప్రైవేట్ వ్యాపారులు పాత పద్ధతికి పదును పెట్టారు. పత్తి యార్డులో జాతీయ అగ్రీ మార్కెట్ విధానం(ఈ నామ్) అమలులో ఉన్నప్పటికీ ఉదయం 8 నుంచి 9 గంటలలోపే పత్తి ఖరీదుల ప్రక్రియ పూర్తి అవుతున్నది. పంటకు ఎంత ధర సీక్రెట్ బిడ్డింగ్‌లో రాబోతుందో కేవలం రెండు గంటల ముందే ప్రతి రైతుకు తెలుస్తుంది.
అయితే పంటను పూర్తిగా పరిశీలన చేసి బిడ్ చేస్తున్న ఖరీదుదారులు తీరా కాంటాల సమయంలో పంట నాణ్యత లేదని కొర్రీలు పెడుతూ ధరలో కోత పెడుతున్నారు. ఈ నామ్ విధానంలో పేచీలకు ఎట్టి పరిస్థితిలో స్థానం లేకపోయినప్పటికీ ఖరీదుదారులు మాత్రం తమ పాత విధానాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. పత్తి యార్డులో ఉన్న మొత్తానికి మొత్తం ఖరీదుదారులు కమీషన్ పద్ధతిలో రాజస్తాన్, గుజరాత్, తమిళనాడు రాష్ర్టాలకు పంటను ఎగుమతి చేస్తున్నారు. అయితే బిల్ టూ బిల్ అని ఒప్పందంతో పంటను ఎగుమతి చేస్తున్న వ్యాపారులు పేచీలు పెట్టి సొమ్ము చేసుకుంటున్న తీరు రైతులు, కమీషన్ వ్యాపారులను సైతం నివ్వెరపెడుతున్నది.
సీసీఐ కేంద్రాల్లో ప్రైవేట్ దందా, తేమ శాతం కొర్రీలను క్షేత్రస్థాయిలో చూసే ప్రభుత్వ అధికారులు కరువయ్యారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఆయా జిన్నింగ్ మిల్లుల వద్ద ఉండి రైతుల సందేహాలను నివృత్తి చేయాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షణ చేసేందుకు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సైతం నిరంతరం పర్యవేక్షణ చేయాలి. వీరితోపాటు జిన్నింగ్ మిల్లుల సమీపంలోని మార్కెట్ కమిటీ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నిరంతరం పర్యవేక్షణ చేయాలి. కానీ.. కేవలం మార్కెట్ కమిటీకు చెందిన డేటా ఎంట్రీ ఆఫీసర్ మినహాయించి సీసీఐ కేంద్రాల్లో ఇతర అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అలా వచ్చామా, ఇలా వెళ్లామా సోషల్ మీడియాలో ఫొటో అప్లోడ్ చేశామా అన్నట్లు అధికారులు వచ్చిపోతున్నారని, తమ సమస్యలు వినే నాధుడు లేడని రైతులు వాపోతున్నారు.
సీసీఐ కేంద్రానికి పత్తిని తీసుకొచ్చే దానికంటే ఎంతకో అంతకు మార్కెట్లో అమ్ముకోవడం నయం అనిపించింది. పంటను ఆరబెట్టి లూజుగానే అందరూ చెప్పినట్లు గుర్రాలపాడు సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకొచ్చాను. ఒకేసారి పంట మొత్తం దాదాపు 25 క్వింటాళ్లు తీసుకొచ్చా. సీసీఐ సిబ్బంది వచ్చి తేమ శాతం చూశారు. బండిలో ఎక్కడో ఒక దగ్గర మీటర్ పెట్టి చూడాలి.. కానీ.. మొదట 11 శాతం తేమ ఉందని రావడంతో బండి మొత్తం పొక్కలు పెట్టి చూశారు. ఒక్కో పోటు వద్ద ఒక్కో రకంగా 11 నుంచి 18 శాతం వచ్చే వరకు చూశారు. తర్వాత ఈ పంట మాకొద్దు అని చెప్పారు. తిరిగి ఇంటికి తీసుకెళ్తే మళ్లీ ట్రాలీ కిరాయి, ప్రైవేట్‌కు తీసుకుపోవాలంటే బస్తాల్లో తొక్కాలి. ఇక నా వళ్ల కాదని ఇదే సీసీఐ కేంద్రంలోనే ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాకు రూ.6,300 చొప్పున అమ్ముకున్నా.
– ధరావత్ లక్ష్మణ్, రైతు, రాంక్యాతండా, రఘునాథపాలెం మండలం
సీసీఐ అధికారులు మమ్మల్ని ఇంత గోస పెడుతున్నారు. నేను తీసుకొచ్చిన పంటలో 11.4 శాతం తేమ శాతం ఉందని వాళ్లే చెప్పారు. సరే తీసుకోండి అని చెప్పాను. వెంటనే మరో మూలకు తేమ శాతం చూశారు. 12 శాతం వచ్చింది. అలా మూడుసార్లు చూసిచూసీ 16 శాతం ఉంది.. ఇప్పుడు కొనలేం అన్నారు. పంట పూర్తిగా ఆరబెట్టు తర్వాత కొంటాం అంటున్నారు. మిల్లు వద్ద పంటను ఎలా ఆరబెట్టాలి. తీరా ఆరబెట్టిన తర్వాత సైతం కొంటారనే నమ్మకం లేదు. సీసీఐకి పంటను తీసుకొచ్చుడు పెద్ద పొరపాటు అయ్యింది.
– ఏనుగంటి ప్రవీణ్, రైతు, పెద్దమండవ, ముదిగొండ మండలం
తెల్లవారుజామున 4 గంటలకు ఖమ్మం పత్తి మార్కెట్‌కు మా నాన్న 40 బస్తాల పంటను తీసుకొచ్చాడు. 8 గంటల సమయంలో కొందరు వ్యాపారులు వచ్చి పంటను చూశారు. క్వింటాకు రూ.6,500 వరకు మాత్రమే ధర పెడతాం అని చెప్పడంతో ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అన్నాం. పదిన్నర తర్వాత మా పంట అమ్ముడుపోయింది. శ్రీనివాస్ అనే ఖరీదుదారుడు కొన్నాడని కమీషన్ వ్యాపారి చెప్పాడు. నాన్న ఇంటికిపోయాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు కాంటా సమయంలో వచ్చి పది బస్తాలు మళ్లీ కోశాడు. పంట బాగాలేదు. అంత పెట్టలేను.. క్వింటాకు రూ.6,100 మాత్రమే పెడుతా అన్నాడు. ఇంత నిలువుదోపిడీ ఇంకా ఏమైనా ఉందా. పంట కొనేవారు మరీ బరితెగించి మాట్లాడుతున్నారు.
– వీరగణేశ్, రైతు, బాలపేటతండా, రఘునాథపాలెం, మండలం