కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు విలవిలలాడుతున్నారు. యాసంగిపై ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులు మొక్కజొన్నకు చివరిదశలో సాగునీరు అందక ఆవేదన చెందుతున్నారు. సాగునీరు సక్రమంగా అందించాల్సిన అధికారుల నిరక్ష్యం కారణంగా పంటలు నిలువునా ఎండిపోతున్నాయి.
బీబీసీ (బోనకల్లు బ్రాంచి కెనాల్) కాలువ ద్వారా వారబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తుండడంతో చివరి భూములకు నీరు అందడం లేదు. బోనకల్లు మండలంలోని నారాయణపురం, ఆలపాడు, రావినూతల గ్రామాలు, చింతకాని మండలం నాగిలిగొండ, వల్లాపురం మేజర్‌లో గోవిందాపురం (ఎల్), తూటికుంట్ల గ్రామాల రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కుంటలు, చెరువుల్లో నీటిని ఆయిలింజన్ల ద్వారా చాలాదూరం పైపులైన్ వేసి మరీ మొక్కజొన్న పంటలను కాపాడుకుంటున్నారు.
– బోనకల్లు, మార్చి 9
బోనకల్లు మండలంలో రైతులు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ జలాలపై ఆధారపడి పంటలు సాగు చేసుకుని జీవిస్తున్నారు. బీబీసీ (బోనకల్లు బ్రాంచ్ కెనాల్) కాలువ పరిధిలోని సుమారు 24వేల ఎకరాల్లో రైతులు ఈ యాసంగికి మొకజొన్న సాగు చేశారు. ఎకరానికి రూ.15 వేలకు కౌలుకు తీసుకుని ఒకొక ఎకరానికి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం మొక్కజొన్న కంకి దశలో ఉంది.
ఈక్రమంలో పంటలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం వారబందీ విధానాన్ని అమలు చేస్తుండడంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మొక్కజొన్న కంకి వేసి గింజ పట్టే దశలో సాగునీరు అందకపోవడంతో కంకి గింజల పట్టక బొండలుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. సాగునీరు సక్రమంగా అందితే ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం నీరు లేకపోవడంతో కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
చివరి ఆయకట్టు భూములకు ఇప్పుడు పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చినా ఆ పంటలను కాపాడలేని దుస్థితి నెలకొంది. బోనకల్లు మండలంలోని నారాయణపురం, ఆలపాడు, రావినూతల గ్రామాలు, చింతకాని మండలం నాగిలిగొండ, వల్లాపురం మేజర్‌లో గోవిందాపురం (ఎల్), తూటికుంట్ల గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు చేతికి అందిన తమ పంటలను కుంటలు, చెరువుల్లో నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా సుదూరం నుంచి పైప్లైన్లు వేసి కాపాడుకుంటున్నారు. అధికారులు నిరంతరంగా సాగునీరు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తమ పంటలు ఎండుతుంటే ఆంధ్రా ప్రాంతానికి సాగునీరు తరలించడం ఏమిటని మధిర ఇరిగేషన్ ఈఈ రామకృష్ణపై బోనకల్లు మండల రైతులు ఆదివారం కలకోట రెగ్యులేటర్ వద్ద మండిపడ్డారు. గత నెల 23న బీబీసీ కెనాల్‌కు సాగర్ జలాలను నిలిపివేసిన అధికారులు ఆదివారం విడుదల చేశారు. కొణిజర్ల జీరో కిలోమీటర్లు రెగ్యులేటర్ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే 21 కి.మీ. రెగ్యులర్ అయిన బీబీసీకి 700 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుంది. కానీ 1,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేశారు. దీంతో బీబీసీ కెనాల్‌కు 500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్నది.
బీబీసీ కెనాల్‌కు సరఫరా అవుతున్న సాగర్ జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించేందుకు అధికారులు నీరు తగ్గించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడి చేరుకొని తమ ప్రాంతంలో మొక్కజొన్న పంటలు ఎండిపోతుంటే ఆంధ్రా ప్రాంతానికి నీరు తీసుకుపోవడం ఏమిటని ప్రశ్నించి రెగ్యులేటర్ల వద్ద తలుపులను తెరిపించారు. బీబీసీ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలని కోరారు. అనంతరం నీటిపారుదలశాఖ ఈఈ రామకృష్ణ, డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, ఏఈలు రాజేష్, ఏడుకొండలు బీబీసీ కాలువను పర్యవేక్షించారు.
మూడెకరాలు కౌలుకు తీసుకొని కలకోట మేజర్ చివర ఆయకట్టులో మొకజొన్న సాగు చేశా. సాగునీరు అందకపోవడంతో కంకి గింజ పట్టలేదు. గతంలో ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పుడు కనీసం 10 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడి, చేసిన చాకిరి వృథాగా పోతుంది. వారబందీ లేకుండా సాగునీటిని విడుదల చేస్తేనే చివర భూములకు నీరు అందుతుంది. గత నెల 23న కాలువకు నీటిని బంద్ చేశారు. ఇప్పుడు నీరు ఇచ్చినా ఆయకట్టు చివర రైతులకు ప్రయోజనం లేదు. జరిగే నష్టం ఇప్పటికే జరిగిపోయింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
– ముప్పవరపు రాంబాబు, కౌలు రైతు, నారాయణపురం
కలకోట మేజర్ కాల్వ పరిధిలోని నారాయణపురంలో ఆరెకరాల మొకజొన్న సాగు చేశాను. ఎకరానికి రూ.15 వేల కౌలు, రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. గింజ పట్టే దశలోనే మొకజొన్న పంటకు సాగునీరు అందడం లేదు. కండ్ల ఎదుటే పైరు ఎండిపోతున్నది. వారబందీ కారణంగా సక్రమంగా సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండుతున్నయ్. కుంటలు, వాగుల్లో నీటిని ఆయిలింజన్ల ద్వారా తోడి వందల మీటర్లు పైప్‌లైన్ వేసి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రయోజనం లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. ప్రభుత్వం కాలువ ద్వారా సక్రమంగా సాగునీరు అందిస్తే మాకు ఈ దుస్థితి ఉండదు.
– సూర్యదేవర అప్పారావు, కౌలు రైతు, నారాయణపురం, బోనకల్లు