రఘునాథపాలెం, జూలై 27: ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ ఎరువుల విక్రయదారులను హెచ్చరించారు. ఆదివారం ఆయన వీ వెంకటాయపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ గోదామును సందర్శించి యూరియా, డీఏపీ స్టాక్‌ను పరిశీలించారు. సొసైటీ సిబ్బంది, ప్రైవేటు డీలర్లు తప్పనిసరిగా స్టాకు బోర్డులను ప్రదర్శించాలన్నారు.
యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరైందికాదన్నారు. అనంతరం రైతులతో ముచ్చటించారు. ఎరువులు సకాలంలో అందుతున్నాయా లేదా, అవసరమైన మేరకు ఇస్తున్నారా అని ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దినసరి పుల్లయ్య, ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు, మండల వ్యవసాయ అధికారి ఉమామహేశ్వర్‌రెడ్డి, ఏఈవో సాయి శిరణ్మయి పాల్గొన్నారు.