భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : పత్తి రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఒకవైపు వానలు దంచికొట్టడం.. మరోవైపు తెగుళ్లు ఆశించడంతో పత్తి దిగుబడి తగ్గుతున్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు దళారుల బెడద ప్రతి ఏటా వెంటాడుతూనే ఉంది. దసరా తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న సీసీఐ నేటికీ కేంద్రాలను ప్రారంభించలేదు. ఏటా లక్షల మెట్రిక్ టన్నులు పత్తి దిగుబడి అవుతుండగా.. అందులో కేవలం సీసీఐ ప్రతి ఏటా 5 నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో పత్తి పంట దళారులపాలవుతున్నది.
వానలు దంచినా, అసలు సాగునీరు లేకున్నా రైతన్నలు నానా ఇబ్బందులు పడి పండిస్తున్న పత్తి పంటపై ఏటా దళారులు మాటు వేసి రైతన్నల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఏకంగా ఇంటికి వెళ్లి మరీ పత్తిని కొనుగోలు చేయడంతో రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా భద్రాద్రి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా పత్తిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా 2,01,216 ఎకరాల్లో పంటను సాగు చేయగా.. 16 లక్షలకు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఇప్పటి నుంచే దళారులు పత్తిని కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ ఏడాది గతేడాది కంటే కొంచెం పత్తి సాగు చేశారు. అంచనాలకు మించి పత్తి సాగు అయ్యింది. సీసీఐ నాలుగు చోట్ల కేంద్రాలను అందుబాటులో ఉంచింది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం గిట్టుబాటు ధర రూ.7,521 ప్రకటించింది. రైతులు సీసీఐ కేంద్రాల్లోనే విక్రయాలు చేసుకోవాలి.
– నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం