ఈ ఏడాది అన్నదాతలకు ఎరువులు అందని ద్రాక్షగా మిగిలాయి. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో యూరియా కోసం నిత్యం సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి దాపురించింది. వేకువజామునే వచ్చి సాయంత్రం వరకు క్యూలైన్లో తిండీతిప్పలు మానుకుని నిలబడినా ఒక్క బస్తా కూడా అందక నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. కొన్నిచోట్ల లైన్లో ఉండీఉండీ నీరు, ఆహారం లేకపోవడంతో కొంతమంది రైతులు కండ్లుతిరిగి సొమ్మసిల్లి పడిపోతున్నారు.
ఈ వానకాలం సీజన్ మొదటి నుంచీ ఇవే ఇబ్బందులు పడుతున్నా.. రానురానూ అవస్థలు తీవ్రతరమవుతున్నా సర్కార్ అలసత్వం ప్రదర్శించడంపై అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ యూరియా కోసం యుద్ధమే చేయాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు.
నారాయణపురంలో సొమ్మసిల్లిన రైతు
అశ్వారావుపేట, సెప్టెంబర్ 9: యూరియా కోసం రెండ్రోజులుగా తిరుగుతున్న ఓ రైతు క్యూలో నిల్చొని సొమ్మసిల్లి పడిపోయాడు. అశ్వారావుపేట మండలం జెట్టివారిగూడెం గ్రామానికి చెందిన జెట్టి సింగరాజు సోమవారం యూరియా కోసం నారాయణపురం సొసైటీకి వెళ్లాడు. రోజంతా వేచిచూసినా ఒక్క బస్తా యూరియా కూడా దొరకలేదు. దీంతో మంగళవారం ఉదయం 5 గంటలకే నారాయణపురం సొసైటీకి మళ్లీ వచ్చాడు.
అప్పటికే రైతులు ఎక్కువ మంది ఉండటంతో క్యూలో నిల్చున్నాడు. సొసైటీ అధికారులు 9గంటలకు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే నీరసించిపోయిన సింగరాజు కొద్దిసేపటికే స్పృహ కోల్పోయాడు. రైతులంతా చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి రైతులు మంచినీరు తాగించి స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో ప్రథమచికిత్స అందించారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. ఒక్కో రైతుకు సొసైటీ అధికారులు కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేయడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచే క్యూ..
దుమ్ముగూడెం, సెప్టెంబర్ 9: దుమ్ముగూడెం సొసైటీ కార్యాలయంలో మంగళవారం పోలీసు పహారాలో యూరియా పంపిణీ జరిగింది. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్లో ఉన్నప్పటికీ ఒక్కో బస్తా చొప్పున కొందరు రైతులకే అందడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగిపోయారు. అయితే తెల్లవారుజాము నుంచే సొసైటీ కార్యాలయం వద్ద పోలీసులు పహారా కాశారు. క్యూలో రైతులతోపాటు చంటిబిడ్డతో వచ్చిన మహిళా రైతులు సైతం నానా అవస్థలు పడ్డారు.
కూపన్ తీసుకొనిపోయి.. రేపు రండి..
ఇల్లెందు, సెప్టెంబర్ 9: ఇల్లెందు మార్కెట్‌యార్డులో ఉన్న సొసైటీ ఎరువుల గోడౌన్ వద్ద యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతులకు అధికారులు మంగళవారం కూపన్లు ఇచ్చారు.. యూరియా వచ్చాక రేపు రండి అంటూ పంపించివేశారు. తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చినా యూరియా దొరకలేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా లేకపోవడంతో ఈ ఏడాది పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకంతోనే రైతులు రావాలి అంటూ ఏవో సూచించడంతో ఆగ్రహించిన రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటన స్థలానికి ఎస్సై హాసీనా సిబ్బందితో చేరుకొని రైతులను క్యూ లైన్లో కూర్చోబెట్టారు.
చిన్నకోరుకొండిలో ఆందోళన
పెనుబల్లి, సెప్టెంబర్ 9: కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు మంగళవారం ఆందోళన చేశారు. యూరియా కట్టల కోసం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తూ సొసైటీ ఉద్యోగులు కార్యాలయానికి రాగానే ఒక్కసారిగా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను శాంతింపజేసి కూపన్ల ద్వారా యూరియా కట్టలు పంపిణీ చేశారు. తక్కువ కట్టలు.. ఎక్కువ మంది రైతులు ఉండటంతో సరిపడా యూరియా అందించాలని రైతులు అధికారులతో గొడవకు దిగారు.
మణుగూరులో చెప్పుల క్యూ
తెల్లవారుజామున లేచి హడావిడిగా వెళ్లి క్యూలో నిలబడితేనే కానీ యూరియా బస్తా దొరకడం లేదు. అష్టకష్టాలు పడి తెల్లవారుజామున వెళ్లినా కానీ అప్పటికే ఓ వందో… నూటాయాభై మందో రైతులు క్యూలో నిలబడుతున్నారు. మణుగూరులోని ఎమ్మెల్యే పాయం కార్యాలయం పక్కన ఉన్న వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం రైతులు యూరియా కోసం నానా ఇబ్బందులు పడ్డారు. సొసైటీ కార్యాలయం వద్ద రైతులు క్యూ లైన్లలో నిలబడి ఎండ నడినెత్తికి వచ్చినప్పుడు ఇక నిలబడే ఓపిక లేకపోవడంతో చెప్పలను క్యూ లైన్లలో పెట్టి చెట్ల నీడన సేద తీరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే రైతులు గోస పడుతున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
-మణుగూరు టౌన్, సెప్టెంబర్ 9
మూడు రోజులుగా తిరుగుతున్నా..
యూరియా కోసం మూడ్రోజులుగా సొసైటీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. చంటిబిడ్డను చంకనేసుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా లైన్లో ఉన్నాను. మంగళవారం ఉదయం నుంచి క్యూలో ఉండగా సాయంత్రానికి ఒక్క బస్తా మాత్రమే దొరికింది.
-శిరీష, సింగవరం, దుమ్ముగూడెం మండలం
వేకువజామున వచ్చా..
యూరియా కోసం రోజువారీ పనులు మానుకుని సహకార సంఘం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా. కొన్నిరోజులుగా నిత్యం కార్యాలయానికి వస్తూ పోతూనే ఉన్నా. మంగళవారం కూడా వేకుమజామునే వచ్చి క్యూలో నిల్చున్నా. సాయంత్రం గడిచినా ఇవ్వాళ కూడా ఒక్క బస్తా సైతం అందలేదు. నా వంతు వచ్చేసరికి యూరియా నిల్వలు అయిపోయాయని అధికారులు చెప్పారు. -పాయం జంపన్న, రైతు, పెద్దనల్లబల్లి, దుమ్ముగూడెం మండలం
అదునుపోయాక ఉపయోగం లేదు..
ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఎరువులు సకాలంలో ఇవ్వకపోవడంతో అదును పోయాక ఎరువులు ఇచ్చినా ఉపయోగంలేదు. యూరియా కోసం ప్రతిరోజూ క్యూ లైన్లో గంటల కొద్దీ వేచి ఉంటున్నా. ఎప్పుడు వెళ్లినా నా వంతు వచ్చేసరికి నిల్వలు అయిపోతున్నాయి.
-కణితి రాజేష్, రైతు, పెద్దనల్లబల్లి, దుమ్ముగూడెం