భద్రాద్రి కొత్తగూడెం(నమస్తే తెలంగాణ)/అన్నపురెడ్డిపల్లి/ బూర్గంపాడు/భద్రాచలం, మే 8 : అకాల వర్షాలు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టిన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాతావరణంలో నెలకొన్న విభిన్న పరిస్థితులతో ఎప్పుడు ఎండగా ఉంటుందో.. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియక రైతులు సతమతమవుతున్నారు.
భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో అకాల వర్షం కురవడంతో అన్నదాతలు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యపు రాసులు తడిచిముద్ద య్యాయి. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ, సుజాతనగర్, చుండ్రుగొండ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. సుజాతనగర్ మండలంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాసులపై కప్పుకోవడానికి టార్పాలిన్లు లేకపోవడంతో తడిచిముద్దయ్యాయి.
అన్నపురెడ్డిపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాసులను వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను చూసి ఉరుకులు పరుగులతో వెళ్లి టార్పాలిన్లు తెచ్చి ధాన్యపు రాసులపై కప్పుకున్నారు. వర్షం తగ్గిన తర్వాత టార్పాలిన్లపై, ధాన్యపు రాసుల చుట్టూ చేరిన నీటిని తొలగించుకున్నారు.
అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరారు. బూర్గంపాడు మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పొలాల్లో ఉన్న చెట్టుపై పిడుగుపడడంతో అగ్నికి ఆహుతైంది. భద్రాచలం పట్టణంలో భారీ వర్షంతోపాటు పిడుగు పడింది. రాజరాజేశ్వరస్వామి ఆలయం సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో పూర్తిగా దగ్ధమైంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.