రామవరం, ఫిబ్రవరి 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పెనగడప, రాంపురం రైతుల పంటలకు సాగునీరు అందడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్న రైతులు బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తుండగా.. మిగతా రైతులు సమీపంలోని ఎర్రచెరువు, పెద్దచెరువు, క్రిష్ణారాయుడు చెరువులపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది అనుకున్నంత వర్షాలు లేకపోవడంతో చెరువులన్నీ ఎండిపోయాయి. దీంతో సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకే(గౌతమ్ ఖని) ఓసీ నుంచి బయటికి పంపిస్తున్న నీరే వారికి గతి. ఈ నీటినే సాగునీరుగా వాడుకొని వరి రెండు పంటలు పండించుకుంటున్నారు. అయితే ఓపెన్‌కాస్ట్ నీటిలో పీహెచ్(పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) లెవల్స్ తక్కువగా 3 శాతమే ఉండడంతో పంటలకు ఇబ్బందిగా మారుతున్నది. జీకే వోసీ మూసివేయడంతో అందులోని నీటిని పంపుల ద్వారా అధికారులు బయటికి పంపిస్తుంటారు.
ఈ నీటిని సమీపంలోని ఎర్రచెరువు, పెద్దచెరువు, క్రిష్ణారాయుడు చెరువుల్లోకి విడుదల చేస్తారు. అయితే ఓసీలో నీరు నిల్వ ఉండడంతో మైనింగ్‌కు సంబంధించిన ఐరన్ పైరటీస్ చేరి చిలుము నీరుగా మారడమే కాకుండా ఆ నీటిలో పీహెచ్ లెవల్స్ సైతం తక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రాంత రైతులకు వేరే దిక్కు లేకపోవడంతో ఈ నీటిని వాడడంతో పంట దిగుబడి తగ్గిపోతున్నది. అంతేకాక క్రిమిసంహారక మందులను ఈ నీటిలో కలిపి వాడితే పనిచేయడం లేదని, చెరువుల్లో చేపలు కూడా చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసీ నుంచి ఇచ్చే నీరు సాగునీరుకు ఉపయోగపడే విధంగా ఉండాలని గతంలో కలెక్టర్, ఎన్విరాల్మెంట్ అధికారులకు రైతులు ఫిర్యాదులు చేశారు. ఇన్ని వందల ఎకరాలకు నీరు అందిస్తున్న సింగరేణి యాజమాన్యం పీహెచ్ లెవల్‌ను పెంచే పరికరాలు, సౌలభ్యాలు అందుబాటులోకి తెచ్చి తమ పంటలకు సాగునీరును అందించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
జీకే ఓసీలో ప్రతిరోజు ఉబికి వస్తున్న ఊట(జల)ను 240 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 10 లక్షల గ్యాలన్ల నీటిని తోడిపోస్తున్నారు. గతంలో మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఈ నీటిని వాడేవారు. ప్రస్తుతం జీకే ఓసీలో నిర్దేశించిన బొగ్గు నిల్వలు తీసివేయడంతో మైనింగ్ మూతపడింది.. దీంతో మైనింగ్‌లో వస్తున్న నీటిని రైతులు అడిగిన నేపథ్యంలో సమీపంలోని చెరువుల్లోకి తరలిస్తున్నారు. ఈ నీటిలో ఉండే పీహెచ్ లెవల్ 3 శాతం ఉండడంతో క్యాల్షియం హైడ్రాక్సైడ్‌ను కలిపి 6 శాతానికి పెంచి సాగునీరుగా ఉపయోగపడేలా సింగరేణి యాజమాన్యం చూస్తున్నది. ప్రతిరోజు మూడు షిప్టుల ద్వారా ఆరుగురు డీఎల్ఆర్ కార్మికులను నియమించి, 300 టన్నుల క్యాల్షియం హైడ్రాక్సైడ్‌ను టన్ను 30 వేల చొప్పున కొని కలుపుతున్నట్లు సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఐనా పీహెచ్ లెవల్ పెరగడంలేదనే అభ్యర్థనలు తమకు వస్తున్నాయని, దీనికోసం త్వరలో మెకానికల్ మిక్సింగ్ యూనిట్ లేదా అధునాతనంగా వచ్చే చిప్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గత 30 సంవత్సరాల నుంచి సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని చెరువులకు నీటిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎర్రచెరువు కింద నాకు రెండు ఎకరాల భూమి ఉంది. గతంలో ఓసీ నుంచి నీరు మంచిగా వచ్చేది. కొన్నిరోజులుగా చిలుము నీరు ఎక్కువగా వస్తున్నది. ఈ నీటిని వాడితే పంట దిగుబడి తగ్గిపోతుంది. కానీ మాకు వేరే దిక్కు లేదు. అధికారులు పట్టించుకొని ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా అందిస్తే బాగుంటుంది.
– చింత రమేష్, పెనగడప రైతు