
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోనే పెద్ద సొసైటీగా రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న వీ.వెంకటాయ పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సేవా సంఘం రైతుల కోసం చేస్తున్నసేవలు మరువలేనివని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. వీ.వెంకటాయపాలానికి చెందిన ప్రాథమిక సహకార సొసైటీ మహాజన సభ జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశానికి అన్నం పెట్టే రైతులకు సేవ చేసే అవకాశం లభించడం సొసైటీ బాధ్యులు అదృష్టంగా భావించాలన్నారు.
రైతులు ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయించకుండా సొసైటీల ద్వారానే అన్ని రకాల సేవలు పొందే స్థాయికి సహకార సొసైటీలు చేరుకోవాలన్నారు. రైతులు సైతం తాము తీసుకున్న రుణాలను ఏ ఏడాదికి ఆ ఏడాదే చెల్లించాలని, రుణమాఫీ వస్తుందని చెల్లించకుండా అధిక వడ్డీ పెంచు కోవద్దన్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే సొసైటీని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లగలిగామనిపేర్కొన్నారు.
సంఘం వైస్ చైర్మన్ రావెళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏబీ మార్గ్ మేనేజర్ మౌనిష, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు అజ్మీరా వీరూనాయక్, మాజీ అద్యక్షులు కుర్రా భాస్కర్రావు, ఎంపీటీసీ యరగర్ల హనుమంతరావు, డైరెక్టర్లు రావూరి సైదుబాబు, చండ్ర మురళీకృష్ణ, బానోత రామారావు, తేజావత్ బావ్సింగ్, గోపగాని ముత్తు లింగయ్య, సుగుణ, అనిత, వెంకన్న, మొర్రిమేకల నాగేశ్వరరావు, గుండె ఆదినారాయణ, సింహాద్రి, సొసైటీ పరిధిలోని సర్పంచ్లు, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.