కరకగూడెం, మే 08 : గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తుండటంతో కరకగూడెం మండల వ్యాప్తంగా కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అరుగాలం శ్రమించి చేతికివచ్చిన యాసంగి పంటను అమ్ముకునేందుకు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు ధాన్యాన్ని తరలించినప్పటికి ధాన్యం కొనుగోలు మందకోడిగా సాగుతుండడంతో ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. గురువారం రాత్రి గంటపాటు జోరు వర్షం కురవడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. శుక్రవారం ఎక్కడ చూసిన ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పుకుని రైతులు భద్రపరుచుకుంటున్నారు. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.