కూసుమంచి, అక్టోబర్ 7 : రైతులు తమ భూముల్లో కూరగాయలు పండిస్తూ మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో కంటే భూగర్భ జలాలు భారీగా పెరగడంతో రైతన్నలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. నిత్య ఆదాయాన్ని తెచ్చిపెట్టే కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. వాటిని స్థానికంగా, సంతల్లో అమ్ముకొంటూనే ఖమ్మం రైతు మార్కెట్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూసుమంచి మండలంలోని కూసుమంచి, కేశ్వాపురం, ధర్మాతండా, కొత్తతండా, తురకగూడెం, చింతల్‌తండా, లోక్యాతండా, జీళ్లచెరువు, గంగబండతండాలో రైతులు అధికంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. సూర్యాపేట-ఖమ్మం రహదారిపై పలు దుకాణాలు ఏర్పాటు చేసి వాటిల్లో అమ్మకాలు చేస్తున్నారు. కూరగాయల సాగులో బాగా మెళకువలు తెలిసిన వీరు వ్యవసాయం కంటే కూరగాయల సాగే బాగుంటుందని చెబుతున్నారు. అయితే సీజన్ లేకపోతే ఒక్కోసారి నష్టాలు కూడా చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు.
రైతులు మార్కెట్‌కు తగ్గట్టుగా కూరగాయలు పండిస్తున్నారు. ముఖ్యంగా చిక్కుడు, బీర, గోరుచిక్కుడు, కాకర, తెల్ల కాకర, టమాట, సోరకాయ, వంకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీతోపాటు కొందరు రైతులు బోడకాకర, పొట్లకాయ సైతం పండిస్తున్నారు.
అన్నిరకాల ఆకుకూరలు బచ్చలకూర, తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, పొన్నగంటికూర, సిరికూర, ఉల్లిఆకు వంటి వాటిని పండిస్తున్నారు. రోజువారీ ధరలు ఖమ్మం మార్కెట్ ఆధారంగా నిర్ణయిస్తున్నారు. సంతల్లో అమ్మే రైతులు ఖమ్మం మార్కెట్ ధరతోపాటు ఖర్చులు చూసుకొని రేట్లు నిర్ణయిస్తున్నారు. ఇలా వందలాది కుటుంబాలు కేవలం కూరగాయల వ్యాపారంపైనే జీవనాధారంగా గడుపుతున్నారు.
చుట్టుపక్కల వారాంతపు సంతల్లో రైతులు వ్యాపారాలు సాగిస్తున్నారు. నేరుగా ఖమ్మం పెద్ద మార్కెట్‌కు కూడా తరలించి అమ్ముకొంటున్నారు. వారాంతపు సంతల్లో కూసుమంచి సోమవారం, నాయకన్‌గూడెం బుధవారం, పాలేరు శుక్రవారం, తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు శనివారం, మోతే, నేలకొండపల్లి, నడిగూడెం వంటి సంతల్లో ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నారు. రైతుల వద్ద పండే వాటితోపాటు ఖమ్మం నుంచి క్యారెట్, బీట్రూట్, బీన్స్, క్యాప్సికం, ఆలుగడ్డ, అల్లం, వెల్లుల్లి వంటి వాటిని తీసుకొచ్చి అమ్ముతున్నారు. సంతలే కాకుండా తట్టల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లి కూడా అమ్ముకుంటున్నారు. కూరగాయలు నిత్యం కావాల్సిన వస్తువు కావడంతో అమ్మకాలు బాగా సాగుతున్నాయి.
మేము మొదటి నుంచి కూరగాయలు పండించి అమ్ముతున్నాం. సంతలు వచ్చాక వాటిల్లో అమ్మకాలు చేస్తున్నాం. మాకున్న రెండెకరాల్లో కూరగాయలే పండిస్తాం. సంతలు లేని సమయంలో బేరగాళ్లకు సరుకు పోసేవాళ్లం.. కానీ ఇప్పుడు సంతలు వచ్చాక వారంలో మూడురోజులు సంతల్లోనే అమ్మకాలు చేసుకొంటున్నాం. మా దగ్గర లేని కొన్ని కూరగాయలను ఇతర రైతుల వద్ద కొని అమ్ముతున్నాం. టమాట, కాకర, ఆకుకూరలు, సోరకాయలు, బీరకాయలు పండిస్తున్నాం. కూరగాయల సాగులో మంచి లాభాలున్నాయి.
– కోటమ్మ, రైతు, ధర్మాతండా
కోతలు లేని కరెంట్‌తోపాటు బావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఇబ్బంది లేకుండా కూరగాయలు పండిస్తున్నాం. గోరుచిక్కుడు, వంకాయ, టమాట వేశాను. బాగానే ఉన్నాయి. గతంలో ఖమ్మంలో రైతుబజారు ఉంటే అక్కడ అమ్ముకునే వాళ్లం. కానీ.. ప్రస్తుతం అది లేకపోవడంతో బయట తక్కువ ధరకు అమ్మకోవాల్సి వస్తున్నది. సంతలో వ్యాపారం చేసే వాళ్లకు పోసి వస్తాం. మంచి ఆదాయం ఉంది. కష్టం కూడా ఉంది.
– జర్పుల రవి, రైతు, ధర్మాతండా
ప్రస్తుతం వ్యవసాయానికి డోకా లేదు. పుష్కలంగా నీరు, ఉచిత కరెంట్ ఉండడంతో రెండు సంవత్సరాలుగా క్యాప్సికం పండిస్తున్నాం. ఇతర కూరగాయలు కూడా పండిస్తాం. మార్కెట్లో క్యాప్సికం కిలో రూ.60 వరకు అమ్ముతున్నాం. కూరగాయల సాగులో మంచి లాభాలు వస్తున్నాయి.
– సావిత్రి, రైతు, రామచంద్రాపురం