రైతన్నలకు అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పి అర్హులను సైతం విస్మరించింది. దీంతో కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అన్నట్లుగా ఉంది పరిస్థితి. అందరికీ ఒకేసారి మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి మూడు విడతల్లో నిధులు విడుదల చేయగా.. మూడోవిడత జాబితాను శుక్రవారం విడుదల చేసింది. అయితే సరిగ్గా రూ.2 లక్షల లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ చేయగా.. ఆ పైబడిన రైతుల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.
అదీకాక అర్హత ఉండి కూడా రూ.2 లక్షలలోపు రైతుల్లో అనేకమందికి రుణమాఫీ కాకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత రోజు నుంచి వ్యవసాయ పనులు వదులుకొని మరీ సొసైటీలు, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. మొత్తానికి తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియక అన్నదాతలు అమోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. – ఖమ్మం, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మూడో విడత రుణమాఫీకి సంబంధించిన జాబితాను ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. కేవలం రైతుల పేర్లతో కూడిన జాబితా మాత్రమే విడుదల కాగా, నిధులకు సంబంధించిన వివరాలు ఎక్కడా పొందుపరచలేదు. మూడు విడతలు కలిపి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,15,345 మంది రైతులకు రుణమాఫీ వర్తించినైట్లెంది. అయితే మొత్తం పంట రుణాలు తీసుకున్న జాబితా ప్రకారం పరిశీలిస్తే సగానికి సగం మంది కూడా జాబితాలో లేరు అనేది స్పష్టమవుతున్నది. గురువారం వైరా పట్టణంలో సీఎం రేవంత్రెడ్డి మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో అదేరోజు సాయంత్రం నుంచి మరుసటిరోజు సైతం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకులు, సొసైటీల చుట్టూ తిరగడం కనిపించింది.
వీరికితోడు రూ.2 లక్షల పైబడి పంట రుణాలు తీసుకున్న రైతులు మా పరిస్థితి ఏమిటీ అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. అర్హత ఉన్నా సాంకేతిక కారణాల వలన అనేక మంది రైతులు జాబితాలో పేరు రాకపోవడంతో వారు సైతం వ్యవసాయ శాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. పొరపాట్లను సరిదిద్దే అధికారం లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికైనా పంట రుణాలు తీసుకున్న మొత్తం అర్హత కలిగిన రైతుల వివరాలను లీడ్ బ్యాంకు అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. తద్వారా జిల్లా రైతాంగానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రుణమాఫీ జాబితాలో అర్హత ఉండి చిన్నచిన్న పొరపాట్ల కారణంగా అనేక మంది రైతులు పంట రుణమాఫీకి దూరమవుతున్నారు. చిన్నపాటి తప్పొప్పులను సరిదిద్దేందుకు గాను సంబంధిత రైతులు గత కొద్దిరోజుల నుంచి సొసైటీలు, బ్యాంకర్ల చుట్టే చక్కర్లు కొడుతున్నారు. ఒక్క నెంబర్ సరిదిద్దేందుకు గాను అధికారులు చొరవ తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల రుణమాఫీకి సంబంధించి నేటివరకు రెండు దఫాలుగా ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేసింది.
తొలివిడతలో 57,857 మంది రైతులకు గాను రూ.258.25 కోట్లు, రెండో విడతలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల పంట రుణాలు తీసుకున్న 33,942 మంది రైతులకు గాను రూ.262.50 కోట్లు.. మొత్తంగా రెండు విడతలు కలిపి 91,799 మంది రైతులకు గాను రూ.520.75 కోట్లు అందజేయడం జరిగింది. అయితే అర్హత కలిగి చిన్నపాటి సాంకేతిక కారణాల వలన పథకానికి దూరమైన రైతులు ఇంచుమించి జిల్లావ్యాప్తంగా 10 నుంచి 15 వేల వరకు ఉండవచ్చని అంచనా.
అర్హత కలిగిన రైతులకు రుణమాఫీ వర్తించేందుకు గాను ఎడిట్ ఆప్షన్ వ్యవసాయ శాఖ అధికారులకు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీసం ఆధార్ కార్డు నెంబర్ను సరిచేసే ఆప్షన్ కూడా మావద్ద లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అర్జీలను తీసుకోవడం వరకే మా బాధ్యత అని బదులిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఎడిట్ ఆప్షన్ ఇస్తే సాంకేతిక సమస్యలకు చెక్ పడే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే రూ.2 లక్షలకు పైబడి పంట రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ అధికారుల సమాచారం ప్రకారం.. జిల్లావ్యాప్తంగా మొత్తం 28 రకాల బ్యాంకుల్లో కలిపి 3,71,157 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరికి సుమారుగా రూ.4,307 కోట్ల రుణమాఫీ వర్తించే అవకాశం ఉంది. అయితే మూడు విడతలు కలిపి నేటివరకు 1,15,345 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించింది. అంటే మరో 2,55,812 మందికి రుణమాఫీ రావాల్సి ఉంది. అయితే రూ.2 లక్షలకు పైబడి పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలో ప్రభుత్వం రూ.2 లక్షల పంట రుణాలు తీసుకున్న రైతులు పై నిధులను బ్యాంకులో చెల్లిస్తే రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయడం జరుగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సదరు రైతులు పక్షం రోజుల నుంచి రూ.2 లక్షల పైబడిన సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని సంబంధిత అధికారులకు చెబుతున్నా వారు రుణాలు కట్టించుకోని పరిస్థితి నెలకొంది. పైబడిన నిధులు రెండు బ్యాంకుల్లో ఉంటే ఏ బ్యాంకులో కట్టాలి. కుటుంబంలో ఇద్దరు పేరుమీద ఉంటే ఎవరు పేరుమీద కట్టాలి అనే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు రైతులు అనేక మంది బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం కనబడడం లేదు.