ఖమ్మం, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంట పొలాలను బీడులుగా పెడితే ఓ తంటా, సరే అని సాగు చేద్దామంటే పెట్టుబడి దొరకక అవస్థలు.. ఇలా యాసంగి సాగుపై అన్నదాతలు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సగానికి సగంమంది రైతులకు కూడా రుణమాఫీ చేయకపోవడంతో పాత రుణాలు పెండింగ్‌లోనే ఉండగా.. కొత్తగా పంట రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతన్నలు నిండా మునిగారు. ఇప్పటికే వానకాలం సీజన్ ముగిసింది. యాసంగి సాగులో చాలామంది రైతులు మక్క, వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం అక్కడక్కడా వరినారు మళ్లు సైతం పోశారు. అయితే పొలాలను దమ్ము చేసుకుంది మొదలు ఎరువుల కొనుగోళ్లు, పంట పొలాలు దమ్ము చేయడం, కూలీలకు సొమ్ము చెల్లించడం ఇలా ప్రతి పనికి చేతినిండా డబ్బు ఉంటేనే తప్ప ముందుకు సాగలేని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వానకాలం, యాసంగికి సంబంధించిన రైతు భరోసా(పంటల పెట్టుబడి సాయం) అందలేదు. రుణమాఫీ కాని వారికి కొత్తగా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదు.. ఫలితంగా సాగే ప్రశ్నార్థకంగా మారింది.
ఈ వానకాలం సీజన్లో అతివృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులు యాసంగిలోనైనా ఆ లోటు పూడ్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. వరుసగా నాలుగు విడతల రుణమాఫీ ప్రక్రియ ముగిసినప్పటికీ వివిధ కారణాల వల్ల రూ.2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న కొందరు రైతులకు ఈ నాలుగు విడతల్లోనూ మొండిచేయి కనబడింది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు ఎడిట్ ఆప్షన్‌ను లైట్ తీసుకున్నారా.. లేదా ప్రభుత్వమే అర్హత ఉన్నా అందరు రైతులకు రుణమాఫీ చేయలేదా.. అన్నది ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. దీంతో రెండురోజుల నుంచి సదరు రైతులు ఖమ్మం నగరంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ఉన్న సొసైటీలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
నాల్గో విడత రుణమాఫీ ప్రకటన అనంతరం వరుసగా రెండురోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో సోమవారం నుంచి ఆయా గ్రామాలకు చెందిన రైతులు నాల్గో విడతలోనైనా తమ పేర్లు వచ్చాయా? తమకు రుణమాఫీ జరిగిందా? అనే విషయాలపై బ్యాంకులు, సొసైటీల వద్ద ఆరా తీస్తున్నారు. నేరుగా వ్యవసాయ శాఖ అధికారులతోపాటు బ్యాంకులు, సొసైటీల్లో బారులు తీరుతున్నారు. సహకార సంఘాల్లో మాత్రం నాల్గో విడతకు సంబంధించిన జాబితా మంగళవారం మధ్యాహ్నం వరకు సైతం బ్యాంకుల నుంచి అధికారికంగా రాకపోవడంతో రైతులకు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది.
రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, అకౌంట్ నెంబర్లలో పొరపొచ్చాలు వచ్చిన రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేసి ఎడిట్ చేసినప్పటికీ అనేక మంది రైతులకు ఎడిట్ కాలేదు. దీంతో సదరు రైతులకు సమాధానాలు ఏమి చెప్పాలో వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెప్పలేకపోతున్నారు. వీరికితోడు రూ.2 లక్షలకు పైబడిన అనేక మంది రైతులు బ్యాంకు సిబ్బంది చెప్పిన ప్రకారంగా రూ.2 లక్షలకు పైబడిన సొమ్ము చెల్లించినా తమకు ఎందుకు మాఫీ కాలేదని అధికారులను ప్రశ్నించడంతో మరో జాబితా ఉంటుందనే సమాధానం తప్ప.. ఎప్పుడు, ఎవరికి వర్తిస్తుందని చెప్పలేకపోతున్నారు. మొత్తంగా పెండింగ్ రుణమాఫీ రైతులు, రూ.2 లక్షలకు పైబడిన రైతుల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
నాకు ఏపీజీవీబీలో రూ.2.12 లక్షల రుణం ఉంది. రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పు కడితే రుణమాఫీ అవుతుందంటే నేను పైగా మొత్తం అప్పు బ్యాంకులో కట్టేశాను. ప్రస్తుతానికి రూ.2 లక్షల లోపే బ్యాంకులో అప్పు ఉంది. అయినా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. మండలంలో నాలాంటి రైతులు ఎందరో ఉన్నారు. మా లాంటి వారి పరిస్థితి ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. ఇచ్చిన మాట తప్పడం వల్ల సర్కార్‌పై రైతుల్లో వ్యతిరేకత వస్తున్నది. అర్హులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి.
-నీరుడు లాజర్, కాంగ్రెస్ నాయకుడు, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం మండలం
రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను బ్యాంకులో తీసుకున్న రూ.50 వేలు కూడా మాఫీ చేయలేదు. తొలి విడతలోనే మాఫీ అవుతుందని ఎంతో ఆశపడ్డా. కానీ.. నాలుగు విడతల్లో విడదల చేసిన జాబితాలో నా పేరు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడులకు చాలా ఇబ్బందిగా ఉంది. నా రుణం మాఫీ అవుతుందో.. లేదో.. అధికారులు కూడా చెప్పడం లేదు.
-పొన్నగంటి వీరన్న, రైతు, కమలాపురం, మణుగూరు మండలం
మా ఇంట్లో ఇద్దరి పేర్లతో పంట రుణాలు తీసుకున్నాం. ప్రస్తుతం మొత్తం రూ.3.10 లక్షల అప్పు ఉంది. మూడో విడత నుంచి కెనరా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. ఇంతవరకు సరైన సమాధానం చెప్పడం లేదు.. ఎప్పుడు మాఫీ వస్తదని అడగిన ప్రతిసారి ప్రాసెస్‌లో ఉంది.. తప్పకుండా వస్తుందంటున్నారు. అసలు రూ.2 లక్షలు పైబడిన వారికి రుణమాఫీ వస్తుందా.. రాదా.. తేల్చి చెబితే బాగుంటుంది. మొదట్లో రూ.2 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేస్తది.. మిగిలిన సొమ్ము మీరే కట్టాలి అని చెప్పారు. కానీ.. ఇప్పుడు ఎవరు ఏమీ చెప్పడం లేదు.
– గోకినపల్లి ప్రసాద్, రైతు, మంగళగూడెం, ఖమ్మంరూరల్, ఖమ్మం జిల్లా
నాకు బేతంపూడి సొసైటీలో రూ.1.30 లక్షల అప్పు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తే.. నా రుణం మాఫీ అవుతుందని అనుకున్నా. నాలుగు విడతల్లో రుణమాఫీ చేసినా.. నా రుణం మాత్రం మాఫీ కాలేదు. పంట పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏటా రైతుబంధు డబ్బులు పడేవి. ఇప్పుడు నా రుణం మాఫీ అవుతుందో.. లేదో.. తెలియడం లేదు.
-బాదావత్ శారద, మహిళా రైతు, తూర్పుగూడెం, టేకులపల్లి మండలం
నాకు అన్ని అర్హతలున్నాయి.. అయినా రుణమాఫీ కాలేదు. రూ.2 లక్షల వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారనే ఆశతో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించాం. కొందరికి మాత్రమే మాఫీ చేసి.. మరికొందరికి చేయలేదు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే.. రేపు, మాపు అంటూ దాటవేస్తున్నారు. రుణమాఫీ కాకపోయినా రైతుబంధు ఇస్తారని ఆశ పడ్డాం. అది కూడా రాలేదు. పంట పెట్టుబడులకు మళ్లీ అప్పు చేయాల్సి వచ్చింది. మళ్లీ జాబితాలో నా పేరు ఉంటుందో, లేదో అర్థం కావట్లేదు.
– సోందె వెంకటేశ్వర్లు, రైతు, చిన్నవారిగూడెం, మణుగూరు మండలం