ఇల్లెందు, జూన్ 28 : ఇల్లెందులో కోల్డ్‌స్టోరేజ్.. ఈ మాట వినగానే తెగ సంబురపడేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ రైతులే. వాణిజ్య పంటలు అధికంగా పండిస్తున్న ఈ ప్రాంతంలో కోల్డ్‌స్టోరేజ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ఇల్లెందు మార్కెట్ పరిధిలో కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితమే ఇల్లెందు మార్కెట్ యార్డు ఏర్పడగా.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఒక వెలుగు వెలిగింది. ప్రతి యేటా రూ.4 కోట్ల వరకు మార్కెటింగ్ శాఖకు ఆదాయం సమకూరుతున్నది. మార్కెట్ పరిధిలో ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి ఇల్లెందులో కోల్డ్‌స్టోరేజ్ నిర్మాణానికి సహకరించాలని ఈ ప్రాంత అన్నదాతలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్ యార్డులు ఉన్నప్పటికీ ఒక కోల్డ్‌స్టోరేజ్ కూడా లేదు. జిల్లాలో విశాలమైన నల్లరేగడి, ఎర్రనేలలు, గోదావరి తీరాన సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ భూముల్లో వాణిజ్య పంటలు అధికంగా సాగు చేస్తారు. ఇల్లెందు, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, దమ్మపేటలో మొత్తం ఆరు మార్కెట్ యార్డులు ఉన్నాయి. కానీ.. రైతులకు మార్కెటింగ్ శాఖ ద్వారా ఉపయోగపడే ఒక పథకం కూడా అమలు కావడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కోల్డ్‌స్టోరేజ్ ఉండి ఉంటే రైతులు పండించిన పంటలకు 90 శాతం(వడ్డీలేని నగదు పథకం) ద్వారా రైతులు ఆరునెలల్లోపు ఎప్పుడు అధిక ధర వస్తుందో అప్పుడు పంటలను అమ్ముకునే సౌకర్యం ఉంటుంది.
ఇల్లెందు మార్కెట్ యార్డు పరిధిలో కోల్డ్‌స్టోరేజ్ నిర్మిస్తే గిరిజన మారుమూల ప్రాంతాలైన గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, కారేపల్లి, గార్ల, బయ్యారం, కామేపల్లి, ఇల్లెందు మండలాల్లో మిర్చి సాగుచేసే రైతులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇల్లెందు మీదుగా చర్ల, భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం మార్కెట్ యార్డుల పరిధి రైతులు మిర్చిని మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, కేసముద్రం మార్కెట్లకు లేదా కోల్డ్‌స్టోరేజ్‌లకు ఇల్లెందు మీదుగానే తరలిస్తుంటారు. అందుకే ఇల్లెందు మార్కెట్ పరిధిలో కోల్డ్‌స్టోరేజ్ నిర్మిస్తే ఈ ప్రాంత గిరిజన రైతులకు రవాణా ఖర్చు, మద్దతు ధర, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పంటలకు వడ్డీ లేని 90 శాతం(మార్కెట్ శాఖ ద్వారా రైతుబంధు అనే పథకం) నగదు పథకాలు వర్తిస్తాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కలిసి ముందుకు సాగితే రైతులకు మేలు జరుగుతుంది.
నేను గతంలో ఖమ్మం వెళ్లి కోల్డ్‌స్టోరేజ్‌లో మిర్చిని పెట్టాను. నాలుగు నెలల తర్వాత మంచి రేటు వచ్చింది. ఇప్పుడు అంతదూరం వెళ్లలేక ఇక్కడే అమ్ముకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఒక్క కోల్డ్‌స్టోరేజీ కూడా లేకపోవడం బాధాకరం. ఇల్లెందులో కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రైతులందరికీ అనుకూలంగా ఉంటుంది.
– సూరేపల్లి వెంకట్రావు,కోయగూడెం, టేకులపల్లి మండలం
ఇల్లెందు మార్కెట్ యార్డుకు ప్రతి ఏడాది రూ.4 కోట్ల మేరకు ఆదాయం వస్తుంది. దీని ఆసరాగా గత పాలకవర్గం ఇల్లెందు మార్కెట్ పరిధిలో కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుత పాలకమండలి, స్థానిక ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకు సహకరించి రైతులకు మేలు చేయాలి.
– బానోత్ కిషన్‌నాయక్, రైతు, ఇల్లెందు
నాకు ఐదెకరాల భూమి ఉంది. ప్రతి ఏడాది మూడెకరాల మిర్చి, ఎకరం వరి, కౌలుకు తీసుకొని మూడెకరాల వరకు పత్తి సాగు చేస్తాను. మారుమూల గిరిజన ప్రాంతమైనందున ఇక్కడ కోల్డ్‌స్టోరేజ్ లేకపోవడంతో ధర తక్కువ ఉన్నాసరే ఎప్పటి పంటను అప్పుడే అమ్ముతున్నాను. కోల్డ్‌స్టోరేజ్ కోసం దూరప్రాంతానికి వెళ్లలేక రైతులందరం ఆర్థికంగా నష్టపోతున్నాం.
– పోతుగంటి వీరభద్రం, రైతు, బోడు గ్రామం, టేకులపల్లి మండలం