బోనకల్లు, అక్టోబర్ 23 : తమకు పంట నష్టపరిహారం అందలేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతూ బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామ రైతులు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యను బుధవారం వేర్వేరుగా కలిసి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆళ్లపాడులో తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందకపోవడంతో నష్టపోయామని వాపోయారు. పంటలు వరద తాకిడికి కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదలకు కొట్టుకుపోయిన పంటలు సర్వే చేయడానికి వచ్చిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన రైతులకు అన్యాయం జరిగిందని, కొంతమంది రైతులకు పంటనష్టం జరగకపోయినా వారికి పరిహారం వచ్చిందని వివరించారు. దీనికి కారణమైన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో తోటకూర వెంకటేశ్వర్లు, మల్లాది లింగయ్య, పారా వెంకటమోహన్, మల్లాది ఉపేంద్ర, నరసింహారావు, మరిది వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.