ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానల జాడ కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారం భం నుంచీ ఆశించిన వర్షాలు కురవలేదు. కొద్ద్దోగొప్పో కురిసిన వర్షాలకు రైతులు వేసిన పంటలు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. వానలు ముఖం చాటేయడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు విత్తనాలు, ఎరువుల కోసం పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వానల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం కంటే ఎక్కువగా పంటల విస్తీర్ణం దాటలేదు. ఇక వరినారు పోసిన రైతులు నారుమడుల్లో ముదిరిపోతున్న నారును చూసి ఆవేదన చెందుతున్నారు. వానల్లేక కండ్ల ముందే పంటలు ఎండిపోతుండడంతో కన్నీరు పెడుతున్నారు.
– రఘునాథపాలెం, జూలై 14

Khammam1
ఖమ్మం జిల్లాలో మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం ప్రారంభమై నెలరోజులు దాటినప్పటికీ ఆశించిన వేగంతో సాగు ముందుకు సాగడం లేదు. జిల్లాలో అనేక మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం.. ఆ తరువాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు విత్తనాలు వేయడంలో వెనుకంజ వేస్తున్నారు. పత్తి సాగు చేసిన రైతులు అవి సరిగా మొలకెత్తక ఆందోళన చెందుతుండగా.. వరి రైతులు పొలాల్లో ముదిరిపోతున్న నారును చూసి దిగులుపడుతున్నారు.
ఈ ఏడాది వానకాలం సాగు సాగుతుందా లేదా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ భాషలో డ్రైస్పెల్ అంటే ఎక్కువ రోజులు వర్షం లేని కాలం. ఒకవేళ ఇది ఏర్పడితే పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, లోటు కారణంగా నష్టం సంభవిస్తే, ప్రత్యామ్నాయంగా సాగు చేయాల్సిన పంటలకు సంబంధించి వ్యవసాయ శాఖ సాంకేతిక విభాగం నుంచి వివిధ సూచనలు సలహాలు జారీ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది.
వానకాలం సీజన్ ప్రారంభమైన జూన్ మొదటి మూడు వారాలు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేసి అనేక మంది రైతులు నష్టం చవిచూశారు. జూన్ చివరి వారంలో కురిసిన వర్షాలు అన్నదాతకు ఊరటనిచ్చాయి. జూలై మొదటి వారంలోనూ వర్షాలు పర్వాలేదనిపించాయి. విత్తనాలు విత్తడంతో మొలకెత్తాయి. ఇప్పుడు మళ్లీ ఐదు రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. వాతావరణం మేఘావృతమై కనిపిస్తున్నప్పటికీ వాన జాడ లేక రైతుల్లో అయోమయం కనిపిస్తోంది.
వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు చెప్పినట్లుగా ఇది ఎల్నినో ప్రభావమేనా అనే భయం రైతుల్లో కనిపిస్తోంది. పలువురు రైతుల్లో తాము రెండోసారి నష్టపోయే పరిస్థితి ఎదురవుతుందా.. మళ్లీ ఏం చేయాలి అనే ఆలోచనలు వెంటాడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 6.50 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి గానూ.. ఇప్పటివరకు సుమారు 3 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయ్యింది. అంటే 48 శాతం మాత్రమే సాగైంది. ఇందులో వరి లక్ష్యం 3.20 లక్షల ఎకరాలు కాగా.. 60 వేల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. ప్రధాన పంటగా కొనసాగుతున్న పత్తి 2.70 లక్షల ఎకరాల లక్ష్యానికిగానూ.. 1.75 లక్షల ఎకరాల్లో సాగైంది. వరినాట్లు వేసేందుకు రైతులు ఇంకా వర్షాలపై ఆధారపడి ఉండగా.. పత్తి సాగు ఎక్కువగా పూర్తయ్యింది. అయితే మొలకెత్తని, ఎండిపోతున్న పత్తి పంట సైతం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది.
మొలకలు ఎండిపోతున్నాయ్..
జూన్ చివరలో వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు వేశాను.. అవి మొలకలు వచ్చాయి. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. ఇప్పటివరకు విత్తనాలు, ఎరువుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టాను. వర్షాలు లేకపోవడంతో భయంగా ఉంది. రెండు మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే మొత్తం మొలకలు ఎండిపోతాయి. తీవ్రనష్టం కలుగుతుంది.
– కూరపాటి శ్రీనివాసరావు, రైతు, వేపకుంట్ల, రఘునాథపాలెం
వానల కోసం ఎదురుచూస్తున్నాం..
వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పడంతో సాగు చేసేందుకు వెనకాడుతున్నాం. ఇప్పటికే అనేకమంది రైతులు పత్తి విత్తనాలు వేసి మొలకలు రాక, వచ్చిన మొలకలు ఎండిపోతాయనే భయాందోళనలో ఉన్నారు. ముందస్తుగా ఎల్నినో హెచ్చరికల కారణంగా నేను ఇంకా పంటల సాగును ప్రారంభించలేదు.
– దొంతు భాగ్యమ్మ, మహిళా రైతు, చిమ్మపూడి, రఘునాథపాలెం