బోనకల్లు, మే 12 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సెంటర్ వద్ద మంగళవారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మండుటెండను లెక్క చేయకుండా బ్రాహ్మణపల్లికి చెందిన రైతు చేపూరి వెంకటనారాయణ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మండలంలో సుమారు 5.73 లక్షల క్వింటాళ్ల మొకజొన్న దిగుబడి వస్తే.. ప్రభుత్వం కేవలం 2.30 లక్షల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందని మండిపడ్డారు.
అకాల వర్షాలతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు ఎప్పుడు తడిసిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఏనాడూ ఇబ్బంది పడలేదని, వారు అడగకుండానే అన్నీ సమకూర్చారని గుర్తు చేశారు. రెండున్నరేళ్లలో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తక్షణమే మక్కల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, కల్లాల్లో కాం టాలు వేసిన బస్తాలను లారీల ద్వారా తరలించాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు బానోత్ కొండ, పారా ప్రసాద్, వేమూరు ప్రసాద్, బందం నాగేశ్వరరావు, పెనుకొండ ఏడుకొండలు, గద్దల వెంకటేశ్వర్లు జర్రిపోతుల రవీంద్రబాబు, చావా హనుమంతరావు, చేపూరి స్వామిదాసు, కాకాని శ్రీనివాసరావు, గరపాకుల రామకృష్ణ, కేతినేని సత్యనారాయణ, గుండపునేని సుధాకర్‌రావు, యనమద్ది శ్రీనివాసరావు, తేళ్లూరి రమేశ్, చిలక నాగరాజు, తోటకూర అనంతరాములు, తెల్లబోయిన నాగేశ్వరరావు, సాధినేని వెంకటేశ్వర్లు, పర్వతాచారి, నరసింహారావు, ప్రసాద్ పాల్గొన్నారు.