చండ్రుగొండ, ఏప్రిల్ 23 : నకిలీ మొక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు(కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే) ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన చండ్రుగొండ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చండ్రుగొండ మండలం పోకలగూడెం పంచాయతీకి చెందిన 12 మంది గిరిజన రైతులు ఓ విత్తన కంపెనీకి చెందిన మొక్కజొన్నలను యాసంగి పంటగా వేశారు. అయితే దిగుబడి సరిగా రాకపోవడంతో గుర్తించిన రైతులు సదరు విత్తన కంపెనీపై ఫిబ్రవరి నెలలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆ కంపెనీపై చర్యలు తీసుకోకపోగా.. తమను పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పించుకోవడంతో విసుగు చెందిన రైతులు బుధవారం మండల పర్యటనకు వచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్లి జాతీయ రహదారిపై బైఠాయించి అడ్డుకున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, కాంగ్రెస్ నాయకులు రైతులను పక్కకు నెట్టే ప్రయత్నం చేయగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ నాయకుడు కిరణ్‌రెడ్డి వారించడంతో అతడిపై రైతులు తిరగబడ్డారు.
దీంతో అక్కడి నుంచి ఆయన ఉడాయించాడు. ఈ క్రమంలో పోలీసులు రైతులను బలవంతంగా పక్కకు నెట్టివేశారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే కారు దిగకపోవడంపై రైతులు మండిపడ్డారు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు వత్తాసు పలుకుతున్నారని రైతులు ఇస్లావత్ శంకర్, మూడ్ రమేశ్, భూక్య హరియా, సక్రు, నాగేష్, రమేశ్, సాయిరాం ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన రైతులే ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.