అశ్వారావుపేట రూరల్, డిసెంబర్ 1: అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు లోతట్టు భూములు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేలేరుపాడు – అశ్వారావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం బైఠాయించారు. నీటిపారుదలశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని గుమ్మడవల్లి, కొత్తూరు, రంగాపురం గ్రామాలకు చెందిన పెదవాగు ప్రాజెక్టు ఆయుకట్టు రైతులు నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూలై 18న కురిసిన భారీ వర్షానికి పెదవాగు ప్రాజెక్టు గండిపడిందని అన్నారు.
నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టుకు గండిపడిందంటూ ఆ సమయంలో పర్యటనకు వచ్చిన మంత్రులు తుమ్మల, పొంగులేటిలకు తాము ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. లోతట్టు భూముల ఆక్రమణలపైనా తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే కబ్జాదారులపై చర్యలు తీసుకొని భూమిని కాపాడాలని అధికారులను మంత్రులు ఆదేశించినట్లు చెప్పారు. అయినప్పటికీ మంత్రుల ఆదేశాలపై చర్యలు శున్యమని ఆరోపించారు.
గండిపడి నీరులేక ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఆంధ్రా రైతులు లోతట్టు భూముల్లో పొగాకు, నువ్వులు సాగు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతే నీరు ఎక్కువగా నిల్వ ఉండదని, అలాగే ప్రాజెక్టు శిథిలమైతే దాని ఆయకట్టు రైతులమైన తాల జీవితాలు నాశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవం లేదని, భూములతో తమ శాఖకు సంబంధం లేదని అంటున్నారని, రెవెన్యూ అధికారులకు చెప్పాలంటూ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండు శాఖల అధికారులూ కలిసి తమ జీవితాలతో చెలగాటమడుతున్నారని ఆరోపించారు.
ఐదేళ్ల క్రితమే తాము ఫిర్యాదు చేసినప్పుడు ఐబీ అధికారులు స్పందించి ఉంటే ప్రాజెక్టుకు గండి పడేది కాదని అన్నారు. అప్పడు ఆ అధికారులు చర్యలు తీసుకొని ఉంటే ప్రాజెక్టు కొట్టుకపోయేది కాదని, తాము ఇంతలా నష్టపోయేవాళ్లమూ కాదని అన్నారు. ప్రాజెక్టులోని ఆక్రమణ భూములను కాపాడకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాస్తారోకో వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులతో చర్చించారు. ఆదివారం కావడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉందని అని; ఐబీ, రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
పెదవాగు ప్రాజెక్టు లోతట్టు ప్రాంత భూములను కొందరు ఆక్రమించి పొగాకు, నువ్వులు సహా ఇతర పంటలు సాగు చేస్తున్నారంటూ ‘నమస్తే తెలంగాణ’ ముందే హెచ్చరించింది. ఈ మేరకు ‘కబ్జాల పంట’ శీర్షికన గత నెల 10న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకపోతే ఆయకట్టు రైతులు ఉద్యమబాట పట్టనున్నారని ముందుగానే స్పష్టం చేసింది. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన అన్నదాతలు.. ఆదివారం రాస్తారోకో చేశారు.