పంటల పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించకుండా కర్షకుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు ఆటలాడుతోంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకూ ఈ సీజన్లోనూ సీజన్‌కు ముందుగా పెట్టుబడిని జమ చేసి రైతుల వ్యవసాయ అవసరాలకు అందించిన పాపానపోలేదు. దీంతో ‘ఈ సీజన్‌కైనా సమయానికి అందితే బాగుండు’ అనే ఆశతో ప్రతి సీజన్లోనూ ఖమ్మం జిల్లా అన్నదాతలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో ఇటీవల ముగిసిన యాసంగిలో నాలుగెకరాల్లోపు విస్తీర్ణమున్న రైతులకు కొద్దికొద్ది మొత్తాల్లో జమ చేస్తూ ఐదారు నెలలు గడిపింది. ఖమ్మం జిల్లాలో ఇంకా 62,561 మంది రైతులకు రూ.179 కోట్లను పెండింగ్‌లో పెట్టింది. ఇక తాజాగా మొదలైన వానకాలం సీజన్‌కైనా సీజన్‌కు ముందుగా సాయాన్ని జమ చేస్తుందేమోనని ఎదురుచూస్తున్న రైతులకు మంత్రి తుమ్మల నిరాశను మిగిల్చారు. నాట్ల నాటికి జమ చేస్తామంటూ కుండ బద్దలు కొట్టారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు క్రమంగా నమ్మకాన్ని కోల్పోతున్నారు.
– ఖమ్మం, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రైతుబంధు కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న రూ.10 వేల సాయం పంటల పెట్టుబడికి సరిపోదని, తాము అధికారంలోకి వస్తే రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీని నమ్మిన రైతులు.. ఆ పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు. కానీ ఆ నాటి నుంచి నమ్మిన రైతులను నట్టేట ముంచుతూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
తాను హామీ ఇచ్చినట్లుగా ఎకరానికి రూ.15 వేలు ఇవ్వకపోగా.. దానిని రూ.12 వేలకు కుదించింది. సీజన్‌కు రూ.6 వేలు ఇస్తామంటూ డాంబికాలు పలికింది. కానీ పట్టుమని ఒక్క సీజన్‌కు కూడా రైతులందరికీ ఇచ్చిన పాపానపోలేదు. చివరికి ఇటీవలి యాసంగి సాయం కూడా పూర్తిస్థాయిలో జమ చేయలేదు. 4 ఎకరాల్లోపు విస్తీర్ణమున్న రైతులకు ఈ ఏడాది జనవరి 26న యాసంగి ప్రారంభంలో మొదలు పెట్టిన యాసంగి సీజన్ సాయాన్ని ఈ ఐదారు నెలలుగా కొద్దికొద్దిగా ఇస్తూ వచ్చారు. ఈలోపు యాసంగి ముగిసింది. వానకాలం కూడా మొదలైంది. కానీ నాలుగెకరాలకు మించిన రైతులెవరికీ యాసంగి సాయం జమ కాలేదు.
అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి విడతలోనూ పంటల పెట్టుబడి సాయం కోసం అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీజన్ ముందే జమ అయిన పెట్టుబడి సాయం.. కాంగ్రెస్ వచ్చాక సీజన్లకు సీజన్లు ఆలస్యమవుతోంది. రైతుభరోసా ఎప్పుడొస్తుందోనని కర్షకులందరూ కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలో నిరుటి వానకాలం సీజన్ రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగిలో కేవలం మూడెకరాల్లోపు విస్తీర్ణమున్న రైతులకే ఇచ్చి ఫుల్స్టాప్ పెట్టింది. మిగిలిన రైతులకు మొండిచేయి చూపించింది. వారి ఆశలపై నీళ్లు జల్లింది. దీంతో కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు నమ్మకాన్ని కోల్పోయారు.
వానకాలమైనా ‘భరోసా’ దక్కేనా?
ఈ వానకాలం సీజన్ ‘రైతుభరోసా’ సాయాన్ని నాట్ల సమయానికి రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించారు. దీంతో చిన్న, సన్నకారు రైతులందరూ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని సాగు పనులు మొదలు పెట్టుకోవాల్సి వస్తోంది. దీంతో రైతుభరోసా పథకం ఉద్దేశం నీరుగారి పోతోంది. రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఖమ్మం జిల్లాలో 3,51,592 మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలి యాసంగిలో కేవలం నాలుగు ఎకరాల్లోపు విస్తీర్ణమున్న రైతులకే రైతుభరోసా సాయం జమ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో 3,51,592 మంది రైతులు ఉండగా రైతుభరోసా కింద గత యాసంగిలో వారి ఖాతాల్లో రూ.438 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే గత యాసంగిలో 2,89,031 మంది రైతులకు రూ.259 కోట్లను మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. ఇంకా 62,561 మంది రైతులకు రూ.179 కోట్లను జమ చేయాల్సి ఉంది. కానీ వానకాలం సీజన్ మొదలైనా గత యాసంగి పెట్టుబడి సాయాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అయితే, గత యాసంగి సాయాన్ని నాలుగెకరాల్లోపు రైతులందరికీ జమ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో వారిలో కూడా చాలా మంది రైతులకు సాయం అందనట్లు తెలుస్తోంది.
కేసీఆర్ పాలనలో సంబురంగా సాగు..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకం కేంద్ర ప్రభుత్వంతోపాటు అనేక రాష్ర్టాలను ఆకర్షించింది. ఐక్యరాజ్య సమితి మన్ననలు కూడా పొందింది. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఏటా వానకాలం, యాసంగి కలిపి రెండు సీజన్లకూ పంటల సమయానికి ముందుగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు పంటల పెట్టుబడి సాయం జమ అయ్యేది. దీంతో నాడు రైతులకు పెట్టుబడి కష్టాలు తీరాయి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధలు తప్పేవి. నాడు బీఆర్ఎస్ సర్కారులో వానకాలానికి రూ.5 వేలు, యాసంగికి మరో రూ.5 వేలు కలిపి మొత్తం ఎకరానికి రూ.10 వేల చొప్పున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించేవారు. దీంతో రైతులందరూ సంబురంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యేవారు. దిగుబడిని గణనీయంగా పెంచేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ ప్రాభవం కనుమరుగైంది.