వనపర్తి టౌన్, జూన్ 21 : స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుభరోసాకు కాంగ్రెస్ పార్టీ రాం..రాం.. పలుకడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థ ల ఎన్నికలు నిర్వహించడం అనివార్యమన్నారు.
అందుకే బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్య నాయకులు గ్రా మాల్లో పర్యటించి ప్రజలకు కాంగ్రె స్ పార్టీ ఇచ్చిన హామీలకు ఎట్లా తూట్లు పొడిచిందో వివరించాలని, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కా ంగ్రెస్ ఇచ్చిన 420 హా మీలు, 6 గ్యారంటీలు అమలు చేయడం లో విఫలమై వ్యతిరేకత మూటగట్టుకున్నదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
ప్రస్తుతం తెలంగాణ సాధించి అభివృద్ధి చేసిన కేసీఆర్ పరిపాలన వైపు చూస్తున్నారని, ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపు కోసం అహర్నిషలు పాటుపడాలని సూచించారు. పార్టీ పట్ల నిబద్ధత, ప్రజలకు మంచి చేయాలనే విశ్వాసం గల వారిని అభ్యర్థులుగా నియమించాలన్నారు. అనంతరం గ్రామాలవారీగా నాయకుల అభిప్రాయలు స్వీకరించి సూచనలు చేశారు.
సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పీ.రమేశ్‌గౌడ్, మీడియా కన్వీనర్ అశోక్, మండల అధ్యక్షుడు బాలరాజు, శివరాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ భీమన్న, మాజీ ఎంపీపీలు సంధ్య తిరుపతయ్య, సేనాపతి, మాజీ సర్పంచులు రమేశ్, శేఖర్, హర్యానాయక్, మతీన్, స్వామి, రాము, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.